అనుకుంటే ఆగడు...!

పట్టు పట్టరాదు...పట్టి విడువరాదు అంటారు పెద్దలు. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు అన్ని కోణాల నుంచి ఆలోచించాలని, ఇక ఆ పని చేయాలనుకున్నప్పుడు ఎన్ని అవాంతరాలొచ్చినా ఆగకూడదని అర్థం. ఒక పని అనుకొని ఆపేస్తే ఇక అది ఎప్పటికీ కాకపోవచ్చు. రెండోది పరువు పోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ టైపే. ఏ నిర్ణయమైనా ఆయన సొంతంగానే తీసుకుంటారు. తీసుకున్న తరువాత ఆరు నూరైనా చేసి తీరాల్సిందేనంటారు. ఇలా ఆరు నూరైనా చేసి తీరుతానని చెప్పినవి కొన్ని కాలేదు. కాని అవుతాయని ఘంటాపథంగా చెబుతారు. 

అసలు విషయానికొస్తే సచివాలయం కూలగొట్టి కొత్తది కట్టాలనే పట్టుదల ఆయనలో  రోజురోజుకు పెరిగిపోతోంది. సచివాలయం కూల్చవద్దని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నకొద్దీ 'పడగొట్టి తీరాల్సిందే' అని నిర్ణయించుకున్నారు. కాంగ్రెసు పార్టీ, మరికొందరు హైకోర్టులో వేసిన కేసులపై విచారణ కొనసాగుతుండగానే సచివాలయం తరలింపుతోపాటు కూల్చివేతకూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. కొత్త సచివాలయం నిర్మాణానికి కార్తీక మాసంలో శంకుస్థాపన చేస్తానని ఇదివరకే ప్రకటించారు. 

అంటే సచివాలయం కూలగొట్టాక శంకుస్థాపన చేస్తానని చెప్పారన్నమాట. కాని కోర్టులో విచారణ జరుగుతోంది. కేసు కోర్టులో ఉంది కాబట్టి భవనాలు కూలగొట్టకూడదు. కాని అన్న మాట ప్రకారం శంకుస్థాపన ఆగకూడదు. ఎందుకంటే...ఈ నెల 14వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఏమిటది? ఆ రోజు కార్తీక పౌర్ణమి ప్లస్‌ సోమవారం. జ్యోతిష్యం, ముహూర్తాలు, వాస్తు మీద అపార విశ్వాసం ఉన్న కేసీఆర్‌ దృష్టిలో ఇది అరుదైన ముహూర్తం. ఆయన ఒక్కరే కాదు. ఆస్తికులు ఎవరైనా దీన్ని అరుదైన ముహూర్తంగానే భావిస్తారు. కార్తీక పౌర్ణమిని పవిత్ర దినంగా భావిస్తారు. 

అలాగే కార్తీక మాసంలో సోమవారం పవిత్రమైంది. రెండు పవిత్రాల కాంబినేషన్‌ పరమ పవిత్రం కదా. కాబట్టి ఆ రోజు శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విచిత్రమేమిటంటే ఈ కేసులో తదుపరి విచారణ హైకోర్టులో అదే రోజు ఉంది. కోర్టు ఏం చెబుతుందో తెలియదు. అయినప్పటికీ అనుకున్న ముహూర్తానికి శంకుస్థాపన చేసి కోర్టు తీర్పు రాగానే కూల్చివేత ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక ఏపీ సర్కారు కూడా తన సచివాలయ భవనాలను అప్పగిస్తుందని కేసీఆర్‌ నమ్ముతున్నారు.  Readmore!

ఏపీ ప్రభుత్వమేమో విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థల పంపకం విషయం తేల్చందే సచివాలయం అప్పగించనని చెప్పింది. ఆ విషయం తేల్చకుండా తీసుకోగలరా? ఇక హైకోర్టు సచివాలయం కూల్చివేతను ఆపిందిగాని తరలింపును ఆపలేదు. కాబట్టి ఈ పని సాగించాలని కేసీఆర్‌ ఆదేశించారు. సచివాలయం కూల్చివేత నిర్ణయం పై కాంగ్రెసు పార్టీ తన దాడిని కొనసాగిస్తూనేవుంది. కేసు విచారణలో ఉన్నా విమర్శలు ఆపడంలేదు. ఫైర్‌ సేఫ్టీ, ఇతర సౌకర్యాలు లేకుంటే గత ప్రభుత్వాలు ఎలా పరిపాలించాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ ప్రశ్నించారు. నిర్ణయం మార్చుకోవాలంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. 

వాస్తవానికి నిజాం రాజు నిర్మించిన భవనం మినహా మిగిలినవి నిర్మించి ఎక్కువ కాలం కాలేదు.  హెచ్‌ బ్లాకు 2008లో, డీ బ్లాకును 2003లో, ఏ బ్లాకును 1998లో, జే బ్లాకును 1990లో, ఎల్‌ బ్లాకును 1981లో, సీ,బీ బ్లాకులను 1978లో, కే బ్లాకును 1975లో నిర్మించారు. అంటే ఇవన్నీ కాంగ్రెసు, టీడీపీ పాలనలో నిర్మితమయ్యాయన్నమాట. ఆ ప్రభుత్వాలు నిర్మించినవి ఉండకూడదనేది కేసీఆర్‌ ఉద్దేశం. అద్భుతమైన సచివాలయం నిర్మించిన ఘనత తనకు దక్కాలని, జనం తన పేరు చెప్పుకోవాలని అనుకుంటున్నారేమో...! మరో కారణం కూడా ఉండొచ్చు. 

ఏపీలో చంద్రబాబు అద్భుత సచివాలయం, అసెంబ్లీ నిర్మిస్తామంటున్నారు. అంత అద్భుతంగా నిర్మిస్తే 'రాజును చూసిన కళ్లతో మొగుడిని చూసినట్లు' అనే సామెతలా ఉంటుంది. కాబట్టి అంతకంటే ముందు తానే అద్భుతంగా నిర్మించాలని అనుకుంటున్నారేమో....! అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య పోటీ ఉంది కదా. కాబట్టి నిర్మాణాల్లోనూ పోటీ పడుతున్నారేమో...! ఏది ఏమైనా కేసీఆర్‌ అనుకుంటే ఆగడు. 

Show comments