ఇంత దరిద్రమైన అనుభవం ఎవడికీ వద్దు

చిన్న చాక్లెట్ ఇచ్చి వెనక్కి తీసుకుంటేనే మనసు చివుక్కుమంటుంది. గెలిచావని చేతిలో ట్రోఫీ పెట్టి, ఆ వెంటనే తూచ్ అని చెప్పి లాక్కుంటే చచ్చేంత బాధ కలుగుతుంది. అలాంటిది ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు వేడుక. అది కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం అవార్డు. అలాంటి ఇంపార్టెంట్ అవార్డును ఇలా ఇచ్చి అలా లాగేసుకుంటే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి దారుణమైన చేదు అనుభవమే లా లా ల్యాండ్ సినిమా యూనిట్ కు ఎదురైంది.

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసే అవార్డు ఫంక్షన్ అంది. ప్రపంచసినీ రంగంలో ఆస్కార్ అనేది ఒక కళ. సినీప్రముఖుల మధ్య, అంగరంగ వైభవంగా ఆస్కార్ అవార్డు అందుకుంటే, ఏ సినీజీవికైనా జన్మ ధన్యమైనట్టే. అలాంటి గోల్డెన్ ఛాన్స్ లా లా ల్యాండ్ సినిమా యూనిట్ కు దక్కింది. 89వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఈ సినిమా ఏకంగా 14 అవార్డులకు నామినేట్ అయింది. ఫంక్షన్ లో మినిమం గ్యాప్ లో ఒక్కో అవార్డు ఈ సినిమాను వరిస్తూనే ఉంది. అలా అరడజను ఆస్కార్లను తన ఖాతాలో వేసుకుంది లా లా ల్యాండ్ మూవీ. అయితే ఇవన్నీ ఒకెత్తు.. ఈ సినిమా యూనిట్ కు జరిగిన పరాభవం మరో ఎత్తు.

ఆస్కార్ లో అత్యంత ప్రతిష్టాత్మక ఉత్తమ చిత్రం కేటగిరీలో కూడా లా లా ల్యాండ్ మూవీ నామినేట్ అయింది. అవార్డుల ముగింపులో భాగంగా లాస్ట్ లో ఈ ప్రెస్టీజియస్ అవార్డును ప్రకటిస్తారు. అప్పటికే 6 ఆస్కార్లు అందుకున్న లా లా ల్యాండ్ యూనిట్... బెస్ట్ ఫిలిం కేటగిరీలో కూడా అవార్డు వస్తుందని ఎదురుచూసింది. అనుకున్నట్టుగానే న్యాయ నిర్ణేతలు అదే సినిమా పేరు ప్రకటించారు. దీంతో సినిమా యూనిట్ సభ్యులు పండగ చేసుకున్నారు. అంతా కలిసి స్టేజ్ పైకి వెళ్లారు. అవార్డు అందుకున్నారు. తమ మనసులో భావాల్ని మైక్ ముందు చెప్పేశారు. యూనిట్ లో ఒకరిద్దరు ఆనందభాష్పాలు కూడా కార్చారు.

ఆల్ ఈజ్ వెల్ అనుకున్న టైమ్ లో నిర్వహకులు సీన్ లోకి ఎంటరయ్యారు. అవార్డు మీకు రాలాదంటూ చావు కబురు చల్లగా చెవిలో వేశారు. మూన్ లైట్ సినిమాకు ఉత్తమ చిత్రంగా ఆస్కార్ వచ్చిందంటూ కవర్ లోంచి కార్డు కూడా తీసి చూపించారు. దీంతో లా లా ల్యాండ్ సభ్యులు షాకయ్యారు. చేతిలో ఉన్న ఆస్కార్ ప్రతిమల్ని లాక్కుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఫైనల్ గా మూన్ లైట్ యూనిట్ కు అభినందనలు తెలుపుతూ స్టేజ్ నుంచి తప్పుకున్నారు. ఇలా చేతికందిన అవార్డు క్షణాల్లో అలా మిస్ అయిపోయింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి మరెవరికీ రాకూడదు. 

Show comments