ఏపీ అవినీతిలో నంబర్ వన్.. థియరీ, ప్రాక్టికల్!

ఆ మధ్య జాతీయ స్థాయి, కేంద్ర ప్రభుత్వ అథారిటీ ఉన్న ఒక సంస్థ.. ఆంధ్రప్రదేశ్ కు అవినీతిలో నంబర్ వన్ ర్యాంకునిచ్చింది. ప్రబలంగా ఉన్న రాజకీయ అవినీతి నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీ ఏ మాత్రమూ అనుకూలమైన ప్రాంతం కాదు.. అని నొక్కి చెప్పింది. 

అవినీతి విషయంలో తమిళనాడు కన్నా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అంటూ చంద్రన్న ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చింది ఆ సంస్థ. అదంతా థియరీ!

దీనికి ప్రాక్టికల్ రుజువులు సమర్పించే పనిని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి, కోట్ల రూపాయలు సంపాదించే ప్రక్రియలో ముందుగా.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు వెలుగులోకి రాగా, వెంకటగిరి ఎమ్మెల్యే పక్కా ఆధారాలతో పట్టుబడి.. ఏపీ లో ఏం జరుగుతోందో జాతి మొత్తానికీ తెలియజేశాడు.

రైల్వే కాంట్రాక్టర్ల వ్యవహారం కావడం.. ఎమ్మెల్యేగారు ముచ్చట పడి అడిగిన ఐదు కోట్ల వ్యవహారానికి ఆధారాలు కూడా లభించడంతో… ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇంత జరుగుతన్నా.. నిప్పుగారి పార్టీ ఎమ్మెల్యే ఇలా పట్టుబడినా.. అధికార పార్టీ నుంచి అధికారికంగా ఇంత వరకూ వివరణ రాకపోవడం గమనార్హం!

వడ్డనం తీసుకున్న మంత్రులు, కాంపౌండ్ లో పిచ్చోళ్లు పడేసి వెళ్లగా పడిపోయిన కోట్ల రూపాయలున్న బ్యాగులు.. ఇవన్నీ అడ్డంగా దొరికిపోయినవే! ఏపీలో ‘లో్కేష్ ట్యాక్స్’ అంటూ ఒకటి నడుస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. రాజధాని విషయంలో గుప్పుమంటున్న అవినీతి కంపు సరేసరి.. ఈ దరిద్రాలు అన్నీ చాలవన్నట్టుగా, బెదిరింపులు, వసూళ్లు!

సాక్షాత్తూ ఎమ్మెల్యేలే.. అది కూడా నిప్పు గారి పార్టీ ఎమ్మెల్యేలే ఇలా అడ్డంగా దొరికిపోయినా.. సదరు నిప్పుగారు ఇంత వరకూ దీనిపై మాట్లాడలేదు! వేరే వాళ్ల మీద అయితే.. ఎగెరిగిరి పడే.. నీతులు వల్లించే.. సోమిరెడ్లు, వర్లలు కూడా ఇప్పుడు వక్కాణించడానికి ముందుకు రావడం లేదు!

ఇక మెజారిటీ మీడియా వర్గాలకు ఈ వ్యవహారంపై ఆసక్తే లేకపాయె. అయినా తెలుగుదేశం పార్టీకి ‘ఐదు కోట్లు’ అంతగా అచ్చిరాలేదేమో! ఆ మధ్య తెలంగాణలో కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలుకు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఐదు కోట్లు. అది కాస్తా అడ్డం తిరిగింది. అధినేతను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సారి మరో ఐదు కోట్ల వ్యవహారం పసుపు పార్టీ పరువునే గాక, రాష్ట్రం పరువును, నిప్పుగారి పరువును కూడా తీస్తోంది. 

మామూలుగా నీతులు వల్లించే.. నిప్పుగారు, ఇప్పుడు మాట్లాడితే మరింత పెంట అవుతుంది, డ్యామేజీ కవరేజీకి ఏ మాత్రం అవకాశం లేదని తెలిసి, మొహం చాటేసి ఉంటారు పాపం!

Show comments