పవన్ కళ్యాణ్ హీరోగా 'మూడో' ముచ్చట

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి టీడీపీ - బీజేపీ కలిసి అధికారంలో వున్నాయి. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ. అసెంబ్లీలో ఇంకో విపక్షం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ పార్టీ కావొచ్చుగాక. కానీ, భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. 

ఈ పరిస్థితుల్లో 'మూడో' ముచ్చట వుందంటూ వామపక్షాలూ నానా హంగామా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాల పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందునా, ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పోరాటాలు చేయడం తప్ప, చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించేంతటి శక్తి వామపక్షాలకు లేదన్నది నిర్వివాదాంశం. అందుకే, ఏదో ఒక బలమైన పార్టీకి 'చేరబడితే' మళ్ళీ తమ ఉనికిని చాటుకోవచ్చన ఆలోచనలో వున్నాయి వామపక్షాలు. 

ఇంతకీ, ఆ బలమైన పార్టీ ఏది.? వామపక్షాల దృష్టిలో అయితే ప్రస్తుతానికి జనసేన పార్టీనే ఆ 'బలమైన పార్టీ' అన్నట్లుగా కన్పిస్తోంది. జనసేన పార్టీతో కలిసి మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని వామపక్షాలు అంటున్నా, ఆ దిశగా జనసేన పార్టీ వామపక్షాలతో కలుస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌ని వామపక్షాలు విమర్శించినంతగా, ఇంకే ఇతర రాజకీయ పార్టీ విమర్శించి వుండదేమో.! 

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం సమయంలో ఆయన వామపక్షాలతో కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో, చిరంజీవి ప్రయత్నాలు ఫలించలేదు. పైగా, చిరంజీవికి వ్యతిరేకంగా వామపక్షాలు నినదించాయి. పైకి ఏం చెప్పినా, తెరవెనుకాల వామపక్షాల ఉద్దేశ్యాలు, ఆలోచనలు, రాజకీయ లక్ష్యాలూ ఇంకోలా వుంటాయి. అదే వామపక్షాలకు అసలైన సమస్య. పోరాటమా.? రాజకీయమా.? అన్నదానిపై వామపక్షాల్లో వున్న కన్‌ఫ్యూజనే ఆ పార్టీలకు పెను శాపంగా మారుతోంది. పైగా, వామపక్షాల మధ్యే సఖ్యత అనుమానాస్పదమైనప్పుడు, మూడో ముచ్చట గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. 

అయినా, ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర పైనే సమయం వుంది. ఈలోగా ఈ మూడో ముచ్చట గోలేంటి.? అటే, ఎవరి గోల వారిది. ఓ పక్క సర్వేలు, ఇంకోపక్క ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెరసి.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ పొలిటికల్‌ రచ్చ పీక్స్‌కి చేరుకుంటోంది.

Show comments