జగన్‌పై డైరెక్ట్‌ అటాక్‌!

వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాడు కూడా జగన్‌ మంచి నేత, ఆయనతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని ఒకటికి పదిమార్లు చెప్పిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మంత్రి కాగానే ఒక్కసారిగా గొంతు సవరించుకున్నారు. ఏకంగా జగన్‌పైనే విమర్శలు చేస్తూ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. పార్టీ మార్పులు, ఫిరాయింపులపై నీతులు చెబుతున్న జగన్‌ నాడు కాంగ్రెస్‌, టీడీపీల నుంచి అనేకమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నపుడు ఎవరినీ రాజీనామా అడగలేదంటూ రంగారావు ఘాటైన ఆరోపణే చేశారు. 

అంతేకాదు, అప్పట్లో కాంగ్రెస్‌ నుంచి తాను పార్టీ మారినపుడు తనకు తానుగానే రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాను తప్ప జగన్‌ ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. నీతి నిజాయితీల గురించి జగన్‌ మాట్లాడడం సరికాదంటూ తాను చేసింది నూటికి నూరుశాతం ఒప్పేనని కూడా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీ వల్లనే సాధ్యమంటూ సరికొత్త పల్లవిని అందుకున్న ఈ నాయకుడు మంత్రిగా తన సత్తాను చాటి చెబుతానని కూడా అంటున్నారు. రానున్న రోజులలో విజయనగరంతో పాటు, ఉత్తరాంధ్రలో టీడీపీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా ఆయన చెప్పడం ద్వారా తన పాత రాజకీయ శిబిరంపై మరింతగా పంజా ఝలిపిస్తానని తేల్చేశారు.

Show comments