లెక్కలు చెప్పడానికి ధైర్యం సరిపోవద్దూ.!

నీతిగా, నిజాయితీగా డబ్బులు సంపాదించేటోడు ఖచ్చితంగా ప్రభుత్వాలకి లెక్క చెప్పాల్సిందే.. పన్నులు కట్టి తీరాల్సిందే. అడ్డగోలుగా సంపాదించేటోడికి మాత్రం అలాంటివేమీ వర్తించవు. వీళ్లనే నల్లకుబేరులంటాం. తిమ్మిని బమ్మిని చేయడంలో ఈ నల్లకుబేరుల తర్వాతే ఎవరైనా. ఈ నల్ల కుబేరులే రాజకీయ పార్టీలకు 'పోషకులు'. అవును, రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో ఈ నల్లకుబేరుల నుంచి వచ్చేవే ఎక్కువ. ఇది జగమెరిగిన సత్యం. 

పెద్ద పాత నోట్ల రద్దు.. ఎవర్ని టార్గెట్‌ చేసింది.? అన్న ప్రశ్నకు, ప్రధాని నరేంద్రమోడీ సమాధానమిస్తూ, 'నల్ల కుబేరుల కోసం' అని చెప్పారు. కానీ, ఆ నల్లకుబేరులు దెబ్బతిన్నారా.? రాజకీయ పార్టీలకు విరాళాలు ఆగాయా.? అంటే, ప్చ్‌.. లేదనే సమాధానం వస్తుంది. పోనీ, దేశంలో పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత వెలుగు చూసిన నల్లధనం ఎంత.? అంటే, దానికీ సమాధానం వుండదు. 

ఎద్దు ఈనిందిరా.. అనగానే, దూడని కట్టేయండిరా.. అన్న చందాన తయారయ్యింది వ్యవహారం. 'పెద్ద పాత నోట్ల రద్దుతో అవినీతి ఆగిపోతుంది.. తీవ్రవాదం తగ్గుముఖం పడ్తుంది.. నల్లధనం వెలుగులోకి వస్తుంది..' అని నరేంద్రమోడీ ప్రకటించగానే, బీజేపీ నేతలే కాదు, మోడీ మాస్కులేసుకున్నవాళ్ళంతా గంగిరెద్దుల్లా తలూపారు.. మోడీకి అనుకూలంగా మాట్లాడారు. సాధారణ ప్రజానీకం కూడా ఇదంతా నిజమేనేమోనని నమ్మారు. తప్పదు మరి, ఏదో చిన్న ఆశ వారిలో అలా మెరిసింది. 

కానీ, చివరికి ఏం జరిగింది.? 50 రోజుల పాటు దేశ ప్రజలకి ప్రధాని నరకం చూపించారు. అంతే, అంతకు మించి, అక్కడ జరిగిందేమీ లేదు. క్యాష్‌ లెస్‌ ఎకానమీ అన్నారు.. కనీసం లెస్‌ క్యాష్‌ ఎకానమీ కూడా లేదిప్పుడు. నెమ్మదిగా మార్కెట్‌లోకి కరెన్సీ వచ్చేస్తోంది. ఇదివరకటి స్థాయిలో కరెన్సీ కష్టాల్లేవు. అవినీతి మామూలే.. నల్లధనం పరమ రొటీనే.! ఇక, తీవ్రవాదమంటారా.? అది అభివృద్ది చెందిన దేశాలకే తప్పడంలేదు, భారత్‌ లాంటి దేశాల్లో అది తగ్గుతుందనీ అది పెద్ద పాత నోట్ల రద్దుతోనే జరుగుతుందనీ ఎవరైనా అంటే అంతకన్నా మూర్ఖులు ఇంకొకరుండరు. 

'కొండని తవ్వి ఎలకని పట్టారు..' అనే విమర్శలొస్తే, 'అవును, ప్రజలకు దక్కాల్సిన సొమ్ముల్ని మెక్కేస్తున్న ఎలుకల్ని పట్టుకున్నాం..' అని చెప్పారు మోడీ. ఏదీ, ఎక్కడ.? ఆ ఎలకల్ని నిజంగానే పట్టుకుంటే, ప్రజలకు మేలు జరగాలి కదా, కనీసం పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత అదనంగా ప్రభుత్వం తరఫున ప్రజల జేబుల్లోకి ఒక్క రూపాయి అయినా వచ్చి తీరాలి కదా.? లేదెందుకు.! 

దేశంలో నల్లధనం ఎంత వుందో తెలియదు, దాన్ని అరికట్టేందుకు పెద్ద పాత నోట్ల రద్దు.. అంటూ సామాన్యుల్ని ఏడిపించారు. పోనీ, 50 రోజుల తర్వాత ఆ లెక్కలు చెప్పారా.? అంటే అదీ లేదు. అటు కేంద్రం, ఇటు రిజర్వు బ్యాంకు.. రెండూ ఇప్పుడు 'నోరు మూసేసుకున్నాయి'. ఎక్కడి దొంగలక్కడే గప్‌చిప్‌.. అన్నట్టుంది ఆ రెండిటి వ్యవహారం. 50 రోజులపాటు జనాన్ని ఏడిపించింది, 'నేను మొనగాడ్ని' అన్పించుకోడానికేనా.? ఇదేనా నరేంద్రమోడీ చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌.?

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నరేంద్రమోడీ మొహం చాటేశారు.. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోనూ ఆయన అదే పని చేయబోతున్నారు. ఎందుకంటే, ఆయన వద్ద సరైన లెక్కలు లేవు.. వున్నా.. ఆ లెక్కలు బయటపెట్టేంత సాహసం ఆయన చేయలేరు. ఎందుకంటే, నిజంగానే మోడీ కొండను తవ్వి ఎలుకని పట్టారు కాబట్టి.

Show comments