రజనీ రావట్లేదు… కమల్ కు అంత సీనుందా?

ఈ మధ్య కాలంలో పొలిటికల్ ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా తన అభిమాన సంఘాలకు చెందిన ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. అభిమాన సంఘాలకు చెందిన ముఖ్య నేతలు, సంఘాల్లోని న్యాయవాదులతో కమల్ ఈ సమావేశం నిర్వహించాడు.

మరి అభిమాన సంఘాలతో సమావేశం అంటే.. సదరు హీరో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడనే సంకేతాలను ఇస్తుంది. ఇది వరకూ చిరంజీవి పొలిటికల్ ఆరంగేట్రానికి సంబంధించి కూడా అభిమాన సంఘాలతో సమావేశాలు జరిగాయి. జిల్లాల్లో పర్యటించి నాగబాబు అలాంటి సమావేశాలు నిర్వహించాడు.

మరి ఇప్పుడు కమల్ వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ శూన్యత ఆవరించింది అనేయడానికి లేదు కానీ... ఎవరైనా సరే, ఒక ప్రయత్నం చేయడానికి మాత్రం ఇది కచ్చితంగా తగుసమయం అనుకోవాల్సి వస్తోంది. జయలలిత మరణం.. ప్రజాభీష్టానికి వ్యతిరేకమైన వ్యక్తులు పాలన చేస్తుండటం.. ఈ కారణాలు కొత్త రాజకీయ పార్టీలకు అవకాశం ఇస్తున్నాయి. అన్నాడీఎంకే కథ దాదాపు కంచికి చేరినట్టే... డీఎంకే బలంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే డీఎంకే తమిళ ప్రజల ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది.

కానీ, రజనీ వంటి హీరో ఈ సమయంలో పొలిటికల్ పార్టీ పెడితే, ప్రజలు కచ్చితంగా అటువైపు మొగ్గు చూపవచ్చు... పార్టీ అధికారంలోకి వచ్చినా రావొచ్చు.. అని అక్కడి పరిణామాలను పరిశీలించే వాళ్లు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ రజనీ వచ్చేలా లేడని స్పష్టంఅయ్యింది. ఆయనను తీసుకురావాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనపడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో కమల్ రాజకీయ తెరపైకి వస్తున్నాడు.

జల్లికట్టు వ్యవహారంలో తమిళ యువతకు మద్దతుగా నిలిచాడు కమల్. వారి తరపున ట్వీట్లు చేశాడు. తనవంతుగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టాడు. అప్పటికే జయలలిత మృతి చెందిన విషయం గమనించాల్సింది. ఆ తర్వాత శశికళను బాహాటంగా వ్యతిరేకిస్తూ ట్వీట్లు పెట్టాడు. అన్నాడీఎంకే పరిణామాలపై ధ్వజమెత్తాడు. చివరకు శశికళ మద్దతు కలిగిన ప్రభుత్వం ఏర్పడటంతో కమల్ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై వివాదం రేగింది కూడా. ఇంతలోనే అభిమాన సంఘాల సమావేశం!

మరి కమల్ రాజకీయ ఆసక్తితో ఉన్నాడని స్పష్టం అవుతోంది. అయితే ధైర్యంగా ముందుకు వస్తాడా? అనేది మిస్టరీ. ఒకవేళ వస్తే ఏమవుతాడు? ఎంజీఆర్ అవుతాడా.. లేక విజయ్ కాంత్, చిరంజీవిల్లా మిగిలిపోతాడా?

Show comments