వినరా సోదర.. లోకేషు ఆస్తుల మాయ.!

ఎవరు అడిగారని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తున్నట్లు.? 

ఎవరూ అడగలేదుగానీ, నైతిక విలువలకు కట్టుబడి గత కొన్నాళ్ళుగా చంద్రబాబు ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తున్నారు.. తండ్రి బాటలోనే తనయుడు నారా లోకేష్‌ కూడా ఆస్తుల వెల్లడి పధకాన్ని కొనసాగిస్తున్నారు. స్వచ్ఛందంగా ఆస్తుల వివరాల వెల్లడి ఎందుకట.? అనడక్కండి. అదంతే. అది వారిష్టం.! జనం ఏమన్నా అనుకుంటున్నారా.? కోట్లాది రూపాయల ఆస్తుల్ని కలిగి వుండీ, తమ దగ్గర వున్నది చాలా చాలా తక్కువని చెప్పడం ద్వారా ప్రజల్లో తాము పలచనవుతున్నామా.? ఇలాంటి విషయాల మీద అటు చంద్రబాబుకిగానీ, ఇటు నారా లోకేష్‌కిగానీ ఏమాత్రం 'రిగ్రెట్స్‌' లేవుగాక లేవు. 

చంద్రబాబు ఆస్తులు గట్టిగా 50 లక్షల లోపు కూడా లేవు. వున్న ఆస్తులు, వాటితోపాటే అప్పులు.. వెరసి లెక్క 50 లక్షలు కూడా దాటదాయె. చంద్రబాబు చేతికి వాచ్‌ కూడా లేనప్పుడు, ఆయనకు లక్షల ఆస్తులు ఎలా వుంటాయట.? ఇదీ చంద్రబాబు అండ్‌ టీమ్‌ వాదన కావొచ్చుగాక. కానీ, చంద్రబాబు సతీమణి పేరుతో ఆస్తులుంటాయ్‌. నారా లోకేష్‌ పేరు మీద ఆస్తులుంటాయి. నారా లోకేష్‌ భార్య బ్రాహ్మణి మీదా ఆస్తులుంటాయి.. నారా లోకేష్‌ తనయుడి పేరు మీదా అంతే. 

హైద్రాబాద్‌లో కొన్ని చోట్ల 200 గజాల భూమి కోటి రూపాయలదాకా పలుకుతోంది. ఇది ఖరీదైన ప్రాంతాల్లో కాదు, ఓ మోస్తరు ప్రాంతాల్లోనే. అలాంటిది, అతి ఖరీదైన ప్రాంతంలో స్థలంతో కూడిన భవనం ధర ఎంత వుండాలి.? కోట్లలోనే. కానీ, నారా లోకేష్‌ చెప్పే లెక్కలు లక్షల్లోనే వుంటాయి. హైద్రాబాద్‌ పరిసరాల్లో ఎక్కడన్నా భూమి ఎకరం కోటి రూపాయలకు తక్కువ వుందా.? కానీ, ఐదెకరాల భూమి విలువ జస్ట్‌ 73 లక్షలేనని లోకేష్‌ ఈ రోజు ప్రకటించారు. 

ముందే చెప్పుకున్నాం కదా, వింటే వినండి.. లేదంటే మీ ఖర్మ.. అన్నట్లుంది నారా లోకేష్‌ వైఖరి. చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తోన్న హెరిటేజ్‌ సంస్థ ఆస్తుల గురించి ప్రపంచమంతటికీ తెలుసు. ఆ సంస్థ ఆదాయం గురించి కొత్తగా చెప్పేదేముంది.? అయినా, ఆ స్థాయిలో ఆస్తులు మాత్రం చంద్రబాబు కుటుంబానికి కనిపించవాయె.! 

నవ్విపోదురుగాక మనకేంటి.? అన్నట్లుగా చంద్రబాబు కుటుంబం ఆస్తుల్ని వెల్లడించేస్తోందంతే.

Show comments