'మెగా' ఈక్వేషన్స్‌ అందుకే మరి.!

కమర్షియల్‌గా విజయవంతమైన సినిమా.. కమర్షియల్‌ హంగులు అదనంగా చేర్చడానికి వీలయ్యే సినిమా.. అందుకే 'కత్తి' సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారు చిరంజీవి. పైగా, గతంలో తనతో సినిమా చేసి కమర్షియల్‌ సక్సెస్‌ అందించిన దర్శకుడితోనే చిరంజీవి 'కత్తి' రీమేక్‌ని తీసుకొస్తున్నారు. హీరోగా తెలుగు తెరకు దాదాపు 8 ఏళ్ళు విరామం ఇచ్చిన చిరంజీవి, మళ్ళీ హీరోగా సినిమాలో నటిస్తున్నారంటే, ఆ సినిమాపై అంచనాలు అలా ఇలా వుండవు. ఆ విషయం ఆయనకీ బాగా తెలుసు. 

అంచనాల సంగతి తర్వాత.. రీ-ఎంట్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిష్టాత్మకంగా వుండాల్సిందేనన్న ఈక్వేషన్స్‌తోనే చిరంజీవి రీమేక్‌ని ఎంచుకున్నారు. సినిమా పట్టాలెక్కిన తర్వాత కూడా అవసరమైన మార్పులు చిరంజీవి చేస్తుండడం వెనుక టెన్షన్‌ ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

'కబాలి' సినిమా వచ్చాక, చిరంజీవి ఇప్పుడు మరింత జాగ్రత్త పడుతున్నారట. ఇప్పటికే ప్రతి సీన్‌నీ ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకుంటున్న చిరంజీవి, 'కత్తి' రీమేక్‌కి ఇంకా ఏమైనా పదును పెట్టగలమా.? అన్న ఆలోచనలో పడిపోయారంటూ టాలీవుడ్‌లో తాజాగా గుసగుసలు షురూ అయ్యాయి. రజనీకాంత్‌, చిరంజీవి.. ఎవరికి వారే. ఒకరితో ఒకర్ని పోల్చలేం. అయినాసరే, అంచనాలు పెరిగిపోతే, ఆ అంచనాల్ని అందుకోవవడం ఎంత కష్టమో రజనీకాంత్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాలతో నిరూపించేశాడు. 

సో, ఇప్పుడు చిరంజీవికీ టెన్షన్‌ తప్పదు.. సినిమా ఎలా వుంటుందని కాదు, అంచనాలు ఆకాశాన్నంటేస్తే పరిస్థితి ఏంటని.? రీమేక్‌ సినిమా.. ఆల్రెడీ హిట్‌ కొట్టిన కాంబినేషన్‌.. ఇలా చిరంజీవికి ఉపశమనం కల్గించే అంశాలు బోలెడన్ని. రిస్క్‌ చేయకుండా, ఇప్పటికే హిట్టయిన సినిమాని రీమేక్‌ చేస్తున్న చిరంజీవికి అన్నీ కలిసొచ్చి.. హీరోగా చేస్తున్న సినిమా హిట్టిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments