గత కొన్నాళ్లుగా ఎక్కడా భర్తతో కలిసి కనిపించడం లేదట విద్యాబాలన్. ఇంకేముంది.. ఎవరికి అనిపించింది వాళ్లు అల్లేశారు. విద్యా విడిపోతోందా? విద్యా-సిద్ధార్థల పెళ్లి బంధం ముగియబోతోందా? విద్య విడాకులు తీసుకోబోతోందా? అంటూ బాలీవుడ్ పత్రికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. ఫంక్షన్లకు విద్య ఒంటరిగా వస్తోందని.. వాళ్లిద్దరూ కలిసి కనిపించడం లేదని మీడియా ఇలాంటి కథనాలు అల్లి పెట్టింది.
ఇన్ని రోజులూ ఈ అంశంపై విద్య స్పందించలేదు కానీ, తాజాగా ‘కహానీ-2’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న ఆమె ఎట్టకేలకూ స్పందించింది. ఇలాంటి కథనాలను ఎద్దేవా చేస్తూ… వ్యంగ్యంగా స్పందించింది విద్య.
“మేము ఈ మధ్య కలిసి సెల్ఫీలు తీసుకోవడం లేదు.. అలాంటి వాటిని ట్విటర్ లో షేర్ చేయడం లేదు. అందుకే ఇలాంటి వార్తలకు ఊపు వస్తోందేమో..’’ అని వ్యాఖ్యానించింది విద్యాబాలన్. తను విడాకులు తీసుకోబోతున్నట్టుగా వస్తున్న వార్తలను ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు విద్య. ఇలాంటి వార్తలు తనకు బోలెడంత వినోదాన్ని ఇస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించింది.
మేం అందరిలాంటి భార్యభర్తలం కాదు.. తరచూ కలిసి మీడియాకు కనిపిస్తూ.. మేం అన్యోన్యంగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె తేల్చి చెప్పింది.