ఏపీలో కొత్త పార్టీ.. ఖాయమేనా?

ఇప్పటికే పండిట్లకు కూడా అంతుబట్టని ఏపీ రాజకీయంలోకి కొత్త పార్టీ ప్రవేశం ఖాయమేనా? ఇందుకు సంబంధించి ప్రయత్నాలు తీవ్రం అయ్యాయా? కుల సమీకరణాల ఆధారంగా, ఒక కులంలోని అసంతృప్తి క్యాష్ చేసుకోవడానికి ఏర్పరిచే ఈ పార్టీ రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపగలదా? రాజకీయంగా ఉపాధి లేని స్థితిలో ఉన్న వారి కొత్త పార్టీ ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ హయాంలో ఎంపీగా ఉండిన మరో వ్యక్తి.. హర్షకుమార్ లు ఇప్పుడు కొత్త పార్టీపై తమ ప్రయత్నాలను తీవ్రం చేసినట్టుగా సమాచారం. మరి ఎంపీలుగా గెలవలేకపోయిన వీళ్ల కొత్త పార్టీ ఏర్పాటు చేసేది? అంటే.. అవును వీళ్లే అని చెప్పాలి. వీళ్ల ఆశాకిరణం ఎవరో చెప్పనక్కర్లేదు.. ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల ఉద్యమకారుడిగా ఊపు మీదున్న ముద్రగడను ప్రధాన పాత్రదారుగా చేసి, దళిత నేతలుగా తాము క్రియాశీల పాత్ర పోషిస్తూ ఈ మాజీ ఎంపీలు పార్టీని ఏర్పాటు చేసే ప్లాన్ ను పట్టాలెక్కించడానికి మాజీ ఎంపీలు గత కొన్ని రోజులుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. 

కాపులు ప్లస్ ఎస్సీలు.. ఈ సమీకరణాల ఆధారంగా పార్టీ పెట్టేస్తే .. బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది, రాజకీయంగా మనం చక్రం తిప్పగలం.. అనేది వీరి లెక్క. రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసిన ద్రోహంపై ఇప్పటికే కాపులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఏదో పవన్ కల్యాణ్ వల్లనే చాలా కాపు ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి.

అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కాపులు పవన్ కల్యాణ్ కన్నా ముద్రగడకే ఎక్కువ విలువను ఇస్తారు… ఇక కాపుల ఓట్లకు తోడు ఎస్సీలవి కూడా యాడ్ అయ్యాయంటే కచ్చితంగా రాజకీయంగా ప్రబల శక్తిగా అవతరింవచ్చు అని చింతా మోహన్, హర్షకుమార్ లు ముద్రగడ వద్ద వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కలను వేసుకుని రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఎన్నికల నాటికి దాన్ని ఊపు మీదకు తీసుకొస్తే.. అప్పుడు తెలుగుదేశం అధినేత పిలిచి పొత్తుకు రమ్మంటాడు! కొన్ని సీట్లు ఇస్తానంటాడు. 

అసలే కులాల లెక్కలు బాబుకు బలహీనత. కనీసం డజను అసెంబ్లీ సీట్లను, నాలుగైదు ఎంపీ సీట్లలో మన వాళ్లను నిలబెట్టుకున్నా రాజకీయంగా ఉనికిని చాటినట్టు అవుతుంది. కెరీర్ అయిపోయిందనుకున్న దశ నుంచి ఒక ప్రాంతీయ పార్టీ శక్తులుగా అవుతున్న దశకు వచ్చిపడతాం.. అని చింతా, హర్షలు భావిస్తున్నారట. ఎలాగూ జగన్ పొత్తుకు రాడు, తెలుగుదేశం కూడా రాకపోయినా.. వేడి మీద ఉన్న కాపులకు తోడు ఎస్సీ ఓట్లు కూడా తోడయ్యాయంటే.. కనీసం ఈ రెండు కులాలూ నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న చోట అయినా మనం సత్తా చాటగలమని వీరు ముద్రగడకు భరోసా ఇస్తున్ననట్టుగా తెలుస్తోంది. 

అయితే గతానుభవాల దృష్ట్యా ముద్రగడ ఇప్పుడు కొత్త పార్టీ అంటే కొంత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తొందరపడకుండా.. ఈ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను ఆయన పూర్తిగా పక్కనపెట్టడం లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా హర్షకుమార్ తరపున ఇటీవల ముద్రగడ ను కలిసినప్పుడు కొత్తపార్టీ సలహాను సమర్థించినట్టు సమాచారం.

Show comments