ఇది తెలిస్తే తటస్థులెవరూ తెదేపాకు ఓటేయరు!

సాధారణంగా ఎన్నికల్లో తటస్థుల ఓట్లు చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రధానంగా అభ్యర్థుల బలాబలాలు పోటాపోటీగా ఉన్న సందర్భాల్లో ఈ తటస్థుల ఓట్లే విజయాన్ని నిర్దేశించేలా ఉంటాయి. తటస్థులు అంటే.. ఏ పార్టీ మీద కూడా పెద్దగా అభిమానం, మమకారం లేకుండా.. ఆ ఎన్నిక సమయానికి ఎవరు బెటర్ అనిపిస్తే వారికి ఓటు వేసే వ్యక్తులు.

ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో  అలాంటి తటస్థ ఓటర్లందరూ తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులను విభజన తర్వాత ఏపీ ప్రభుత్వానికి తొలి చీఫ్ సెక్రటరీగా సేవలందించిన ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించడం విశేషం. 

కృష్ణారావు పదవీ విరమణ చేసిన వెంటనే చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ అంటూ ఒకటి ఏర్పాటుచేసి దానికి ఆయనను సారధిని చేశారు. అయితే దానికి నిధులు ఇవ్వకపోవడంతో కృష్ణారావు అసంతృప్తిని వ్యక్తం చేయడం అంతా పెద్ద గందరగోళం అయింది. ఆయనను పదవినుంచి తొలగించేసి.. తమకు అనుకూలంగా ఉండే  మరో వ్యక్తిని చంద్రబాబు నియమించుకున్నారు. 

తాజాగా మరో మారు చంద్రబాబునాయుడు సర్కారు పనితీరు మీద ఐవైఆర్ కృష్ణారావు దాడికి దిగడం విశేషం. ఈ సారి మరీ పనిగట్టుకుని సీఎంఓ వ్యవహారాల మీదనే ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి తనను తాను నిలువెత్తు పారదర్శకతగా అభివర్ణించుకుంటూ ఉంటారు. అయితే వాస్తవంలో ముఖ్యమంత్రి కార్యాలయం అనేది సకల అరాచకాలకు నిలయంగా మారిపోయిందంటూ మాజీ చీఫ్ సెక్రటరీ స్వయంగా ఆరోపిస్తుండడం విశేషం.

చంద్రబాబు కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారిందని, పాలనలో పారదర్శకత లోపించిందని, సంస్కరణలు అమలు చేయడం లేదని అంటున్నారు. సెక్రటేరియేట్ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తూ మొత్తం పాలనను సీఎంఓ నుంచే నడిపించజూస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తటస్థ ఓటర్ల విషయానికి వస్తే ఇవి నిర్ఘాంత పరిచే వివరాలే అనుకోవాలి. 

సాధారణంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయమే అరాచకాలకు నిలయంగా మారుతూ ఉన్నదంటే తటస్థ ఓటర్ల మీద ఇలాంటి వివరాలు చాలా ప్రభావం చూపిస్తాయి. పైగా ఆరోపణలు చేసినది కూడా ఏదో రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదు. ఒకప్పుడు చంద్రబాబునాయుడు స్వయంగా నెత్తిన పెట్టుకున్న అత్యున్నత ఐఏఎస్ అధికారి.

అలాంటి మాటలు తటస్థ ఓటర్లపై ప్రభావం చూపిస్తాయి. నంద్యాల ఎన్నికల్లో తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడం మాత్రమే కాదు.. ప్రభుత్వాన్ని తరచుగా కృష్ణారావు లాంటి వారు తప్పుపడుతూ ఉంటే గనుక.. వచ్చే సాధారణ ఎన్నికలకు  కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తటస్థులు నమ్మడం కష్టమైపోతుందని పలువురు భావిస్తున్నారు. 

Show comments