సుబ్రమణ్య స్వామి.. మీ కూతురు కథేంటి..?

చాలానే హద్దులు దాటుతున్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. కాంగ్రెస్ అధిష్టానంపై ఈయన చేసే రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా… వ్యక్తిగత విమర్శలకు కూడా స్వామి దూసుకుపోతుండటం దురదృష్టకరం. అలాగే ప్రముఖుల విషయంలో మతం అనే అంశం గురించి కూడా స్వామి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. తను బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉన్నాననే మాట మరిచి స్వామి అనుచితమైన ట్వీట్లను పెడుతున్నాడు. 

ఒకవైపు రాహుల్ గాంధీ పెళ్లి గురించి స్వామి వివాదాస్పదమైన మాటలే మాట్లాడుతున్నాడు. రాహుల్ కు 40 యేళ్లు దాటినా వివాహం చేసుకోవాలనిపించడం లేదని.. 37 యేళ్ల అఖిలేష్ పిల్లలకు తండ్రి అయినా, 40 యేళ్లు దాటిన రాహుల్ ఇప్పటికీ చిన్న పిల్లాడే.. అంటూ స్వామి గేలి చేస్తున్నాడు. రాహుల్ ను విమర్శించడానికి స్వామికి సర్వహక్కులూ ఉండవచ్చు గాక.. రాహుల్ వివాహం గురించి మాట్లాడటం మాత్రం సమర్థనీయం కాదు. దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడటం విడ్డూరం. మరి రాహుల్ పెళ్లి గురించి మాట్లాడుతున్న స్వామి.. తన ప్రియతమ నేత మోడీ వైవాహిక జీవితం గురించి ఎందుకు మాట్లాడడు?

రాహుల్ కు పెళ్లి కాలేదని గేలి చేస్తున్న స్వామి.. మోడీ తన భార్యను ఎందుకు విడిచిపెట్టాడో ఆరా తీశాడా? మోడీ ఢిల్లీలో ఉంటే.. ఆయన భార్య ఎక్కడో గుజరాత్ లో ఎందుకు ఉంది? విడాకులు అయితే తీసుకోలేదు.. అయినా కూడా ఆమెను ఎందుకు దూరం పెట్టారు? మోడీ భార్య తన పరిస్థితి ఏమిటో దిక్కుతోచని స్థితిలో ఉంది కదా.. తన చుట్టూ ఉన్న వ్యక్తులెవరో తెలుసుకోవడానికి ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంది కదా.. ఈ అంశాల గురించి మాట్లాడితే? మోడీ వైవాహిక జీవితం గురించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేస్తే? రాహుల్ మగతనంపై జోకులేస్తున్నట్టుగా.. స్వామి గారి ప్రియతమ నేత గురించి మాట్లాడితే? అదెలా ఉంటుంది? 

అలాగే శ్రీమాన్ సుబ్రమణ్య స్వామిగారు మరో ట్వీటు కూడా పెట్టారు. ఇది విఖ్యాత గాయకుడు జేసుదాసు విషయంలో. క్రైస్తవ మతస్తుడు అయిన జేసుదాసు తిరిగి హిందూమతంలోకి వచ్చేయాలన్నట్టుగా స్వామి ట్వీట్ చేశాడు. జేసుదాసు పూర్వీకులు హిందువులే అయ్యుంటారని.. కాబట్టి ఆయన కూడా హిందూమతంలోకి పునఃప్రవేశం చేయాలని స్వామి వారు సూచించారు. వెల్కమ్ చెప్పారు. 

రాజకీయ నేతల గురించి రొచ్చు కామెంట్లు చేయగల తాను కళాకారుల గురించి కూడా చేయగలనని స్వామి ఈ విధంగా నిరూపించుకున్నాడు. జేసుదాసు క్రైస్తవుడే కావొచ్చు.. హిందూ భక్తి గీతాల ఆలాపనలో ఆయనకు దక్షిణభారతదేశంలో సాటి వచ్చేవారున్నారా? ఆ క్రైస్తవుడు పాడిన గీతాలే హిందువులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయే? గురువాయర్ ఆలయంలో కి ఆయనను ఆహ్వానించి సన్మానించుకొన్నామే.. మరి అలాంటి గాయకుడి వ్యక్తిగత విషయాల గురించి స్వామికి ఎందుకు?

అయినా.. ఊళ్లో వాళ్ల మతాల గురించి, పెళ్లిళ్ల గురించి చాలా ఈజీగా కామెంట్లే చేసేస్తూ, జోకులు వేసేస్తున్న స్వామి గారు..తన కూతురు గురించి ఎందుకు ఆలోచించలేదో! ఈ వీర హిందుత్వవాది తనయ సుహాసిని ఒక ముస్లింను వివాహం చేసుకుంది కదా! ఆ పెళ్లితో సుహాసినీ కాస్తా సుహాసినీ హైదర్ అయ్యింది కదా! ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా.. ఎడిటర్ గా, కాలమిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తూ తన పేరు ను సుహాసినీ హైదర్ గా చెప్పుకొంటోందామె. మరి జేసుదాసును హిందూ మతంలోకి తిరిగి ఆహ్వానిస్తున్న స్వామి తన కూతురు గురించి ఎందుకు మాట్లాడడు? ‘లవ్ జిహాద్’ గా పేర్కొనే వ్యవహారం నుంచి తన కూతురును ఎందుకు బయటకు లాగలేకపోయాడో ఈ మహాశయుడు.

Show comments