అనంతపురం ఫ్యాక్షన్ హత్యల పరంపర దశాబ్దాలకు దశాబ్దాలు కొనసాగుతోంది అంటే దాంట్లో రాజకీయ పార్టీలదే ముఖ్యపాత్ర. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే.. ఫ్యాక్షనిజంలో ఒక వర్గానికి చేయూతను ఇచ్చింది. రాజకీయంగా బలపడటానికి ఒక వర్గాన్ని చేరదీసింది పచ్చ పార్టీ. ఆ పార్టీకి దగ్గరైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తెలుగుదేశం హయాంలో ప్రబల శక్తిగా ఎదిగాడు. అప్పటికే రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తులను మట్టుబెట్టి తను పులిస్వారీ చేయడం ఆరంభించాడు. చివరకు అదే పులికి బలయ్యాడు.
ఆ కథ అటుంచితే.. ఏపీలో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారీ రక్త చరిత్రలో కొన్ని కొత్త పుటలు పుట్టుకొస్తాయి. 1995 నుంచి 2004 వరకూ తెలుగుదేశం వైపు నుంచి వేట కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తులతో మొదలుపెట్టి.. పెనుకొండ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పేరు చెప్పిన కార్యకర్తల వరకూ అనేకమందిని బలితీసుకున్నారు. వాటిని ఫ్యాక్షన్ హత్యలు అనడం కన్నా.. ఆధిపత్య పోరు అనడమే సబబు.
ఈ ఆధిపత్యపోరు లో తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలా పాఠాలే నేర్పారు.! 1995 నుంచి 2004ల మధ్య కాంగ్రెస్ నేతల, వారి అనుచరుల హత్యల సంఖ్యను లెక్కబెట్టడం మొదలుపెడితే అది వందల సంఖ్యకు చేరుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పడ్డ వికెట్లు ఐదారు మాత్రమే!
అందులో పరిటాల, తగరకుంట ప్రభాకర్, మాలపాటి.. వంటి వారు ముఖ్యులు. తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ నేతల ఇళ్లలోని ఆడవాళ్లను కూడా దారుణంగా హతమార్చడం జరిగింది. అయితే మాలపాటిని చంపినప్పుడైనా, తగరకుంటను కాల్చి చంపినప్పుడైనా.. పక్కనే ఉన్న వాళ్ల కుటుంబీకుల జోలికి వెళ్లలేదు! ఇదీ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ప్రధాన తేడా.
ఇక ఇప్పుడు ఈ ఆధిపత్య పోరు.. తెలుగు తమ్ముళ్ల మధ్యనే జరుగుతోంది. నిన్న అనంత లో జరిగిన హత్యాకాండలో బాధిత వర్గాలు, బాధ్యులు.. ఇద్దరూ తెలుగుదేశం వారే! ఈ మాట చెబుతున్నదీ తెలుగుదేశం వారే! ఈ విషయంలో తెలుగుదేశం నేతలైన సూటిగా విషయాన్ని చెబుతున్నారు కానీ, తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం ఈ విషయాన్ని దాచడానికి శతథా ప్రయత్నిస్తోంది!
అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులే తమ వారిని చంపారని.. పరిటాల కుటుంబానికి చెప్పుకుని బోరు మన్నారు హతుల బంధువులు. అయితే లార్జెస్ట్ సర్కులేటెడ్ డెయిలీ లో మాత్రం ఈ ప్రస్తావనేలేదు! ఇద్దరు వ్యక్తులను పట్టపగలు చంపితే.. వారి కుటుంబీకుల ఆవేదనకు కూడా స్థానం ఇవ్వనప్పుడు పత్రికలున్నది ఇంకెందుకు? అలాగే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చనిపోయిన రౌడీషీటర్, అతడి బంధువు పరిటాల కుటుంబానికి బాగా కావాల్సిన వారు అనే విషయాన్ని కూడా ఈ పత్రిక దాచేసింది!
స్వయంగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ లు మృతుల కుటుంబాలను పరామర్శించారు! బాధితుల ఆవేదనను పంచుకున్నారు. ఇదీ.. మృతులకూ, పరిటాల కుటుంబానికి ఉన్న అనుబంధం. అయితే.. ఆ రౌడీ షీటర్లు ఎవరు.. వారు జనాల దగ్గర ఎలా డబ్బులు వసూలు చేశారు.. దాంట్లో ఎలా తేడాలొచ్చాయి.. అనే విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించిన పచ్చ మీడియా మృతులు పరిటాల కు బాగా కావాల్సిన వారనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు!
ఈ విషయాలను ప్రస్తావిస్తే.. ఎక్కడ తమ వాళ్లకు చెడ్డపేరు వస్తుందో అని భయం కాబోలు. వాళ్లే దాచుకోవడం లేదు.. హత్యస్థలానికి, మార్చురీకి వాళ్లే వచ్చారు. అయినా పచ్చ పత్రికలకు ఇంత ఆరాటం ఏలానో! అటు చంపిందీ తెలుగుదేశం వారే, చచ్చిందీ తెలుగుదేశం వారే అనే మాటల మధ్య.. పచ్చపత్రికల కష్టాలు అన్నీ ఇన్నీ కావు పాపం.