నరేంద్ర మోడీకి ముందస్తు 'దూకుడు'.?

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.. మూడు రాష్ట్రాల్లో దెబ్బతినేశారు.. రెండు రాష్ట్రాల్లో బంపర్‌ మెజార్టీ.. అయినాసరే, కమలదండు నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పీఠమెక్కగలిగింది. అదే మరి, నరేంద్రమోడీ మ్యాజిక్‌ అంటే. ఫలితాల తర్వాత ఈక్వేషన్స్‌ మారిపోయాయ్‌.. గెలిచింది రెండిట్లో.. అధికారం దక్కించుకున్నది నాలుగింట్లో.. ఎలా అధికారం దక్కిందన్నది కాదన్నయ్యా.. అధికార పీఠమెక్కామా లేదా.? అన్నదే కావాలయ్యా.. అన్నట్టు, బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 'విజయాన్ని' తన ఖాతాలో వేసుకుంది. సందట్లో సడేమియా, పంజాబ్‌ షాక్‌ని బీజేపీ లైట్‌ తీసుకుందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీకి తిరుగు లేకుండా పోతోంది. మొన్న ముంబై, ఇప్పుడు ఢిల్లీ.. ఒకటి దేశ ఆర్థిక రాజధాని, ఇంకోటి దేశ పరిపాలనా రాజధాని.. రెండిట్లోనూ బీజేపీదే హవా.! ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్ని దేశమంతా విశ్లేషిస్తోంది. నరేంద్రమోడీ మేనియాకి ఇది నిదర్శనమని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇప్పుడిక ధైర్యంగా నరేంద్రమోడీ సర్కార్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు. 

ఎటూ, 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు..' అనే కాన్సెప్ట్‌ని అమల్లోకి తీసుకురావాలని నరేంద్రమోడీ ఉవ్విళ్ళూరుతున్నారు గనుక, ఆ ప్రయోగమేదో ముందస్తుతో కలిసి మిక్స్‌ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీహార్‌ ఎన్నికల్లో దెబ్బ తగిలింది.. అంతకు ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాక్‌ తగిలింది.. అయితే ఆ గాయాల్ని బీజేపీ ఎప్పుడో మర్చిపోయింది. అయినప్పటికీ కూడా, ఎక్కడో ఏదో ఒక మూల చిన్న అనుమానం అలాగే మిగిలిపోతే మాత్రం, నరేంద్రమోడీ ముందస్తు సాహసం చేయకపోవచ్చు. కానీ, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు మాత్రం, బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకురావడం, ముందస్తు సరదా పెంచడం సహజమే. 

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ముందస్తు ఎన్నికల కోసం ముందుగానే తయారైపోతున్న దరిమిలా.. నరేంద్రమోడీ సర్కార్‌ కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments