కబాలి...ఇంకా చాలా టైముంది

సౌత్ సూపర్ స్టార్ రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి చాలా వార్తలే చక్కర్లు కొట్టాయి.. కొడుతున్నాయి.. ఇంకా కొడతాయి కూడా. లేటెస్ట్ న్యూస్, రజనీ తన పార్టీని డిసెంబర్ 12న ప్రారంభిస్తారని. కానీ కప్ టు లిప్ అన్న ఇంగ్లీష్ సామెతలా. ఆర్నెల తరువాత అంటే ఇంకా చాలా వ్యవహారాలుంటాయి.

రజనీ లాంటి వాళ్లు అంత సులువుగా తెగించలేరు. వాళ్లకు ఎరీనా మొత్తం ఖాళీగా వుండాలి. గెలుపు ఖాయమనే ధీమా వుండాలి. ఏ వైపు నుంచీ అటాక్ వుండదన్న భరోసా వుండాలి. అప్పుడే రంగంలో వీరలెవెల్లో ఫోజు కొడుతూ దూకేస్తారు. లేదూ అంటే, ఏదో ఒక సాకు చెబుతూ కాలక్షేపం చేస్తూ వస్తారు.

చాలా ఏళ్లుగా రజనీ చేస్తున్నది ఇదే. తమిళ నాట ఏ ఒక్క రాజకీయ నేత బలంగా వున్నా రజనీ తన నిర్ణయాన్ని దేవుడి మీదకు తోస్తూ వచ్చారు. ఇప్పడు తమిళనాట రాజకీయ శూన్యత వుందీ అని అనిపిస్తోంది కాబట్టి, ఆయన తెగిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇదే స్టాలిన్ నో మరోకరో కాస్త బలోపేతం అయితే, మళ్లీ రజనీ ముడుచుకుపోవడం ఖాయం. అదేమంత విడ్డూరం కాదు. నిజంగా రజనీ తెగించి రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఇన్ని శషభిషలు అక్కరలేదు. ఒక్క ముక్క ‘నేను రెడీ’ అని చెప్పేసి, తన పనులు తాను సైలెంట్ గా చేసుకోవచ్చు.

అంతే సైలెంట్ గా పార్టీ పనులు చేసుకోవచ్చు. అలా కాకుండా, ఇదిగో, అదిగో అనే ఫీలర్లకు తావిస్తూ, వినాయక చవితి, దసరా, దీపావళి, బర్త్ డే అంటూ మహుర్తాలు చూస్తున్నారు అంటే ఇంకా ఎక్కడో చిన్న అనుమానం రజనీ మనసులో వుండిపోయిందనే అనుకోవాలి.

అలా అనుమానం ఎప్పుడైతే వుంటుందో, జనాలు కూడా రజనీ వెంట నడవాలో వద్దో డిసైడ్ కావడానికి కూడా టైమ్ తీసుకుంటారు. ఈ లోగా రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక? ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే?

Show comments