స్టార్‌ స్టార్‌ పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌.?

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని వరుసగా ఐదు రోజులపాటు నిర్వహించిన రజనీకాంత్‌, ఆ సమావేశాల్లోనే రాజకీయాలపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. 'యుద్ధానికి సిద్ధంగా వుండండి..' అని అభిమానులకు పిలుపునిచ్చారాయన. 

ఇంతకీ, యుద్ధమెప్పుడు.? అంటే, బహుశా 2019 ఎన్నికల సమయానికి కావొచ్చు. ఈలోగా, యుద్ధ సన్నాహాలు.. అదేనండీ రాజకీయ రంగ ప్రవేశం, పార్టీ ప్రకటన వంటివి చేయాలి కదా. ఆ పనులకీ తెరవెనుక కసరత్తులు ప్రారంభమయ్యాయట.

ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్‌ సోదరుడు వెల్లడించారు. పార్టీ పేరుపైనా, జెండాపైనా మంతనాలు జరుగుతున్నాయనీ, అతి త్వరలో రాజకీయ పార్టీ పేరుని ప్రకటించబోతున్నామనీ చెప్పుకొచ్చారు రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌. అవినీతికి వ్యతిరేకంగా రాజనీకాంత్‌ రాజకీయ పోరాటం చేస్తారన్నది సత్యనారాయణరావు గైక్వాడ్‌ చెబుతున్నమాట. 

మొత్తమ్మీద, తమిళ సూపర్‌ స్టార్‌ రాజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై కొంత స్పష్టత వచ్చేసింది. పార్టీ ప్రకటన ఎప్పుడు.? అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. జూన్‌ నెలాఖరు లేదా, జులైలో ఈ ప్రకటన వుంటుందని తెలుస్తోంది. 

రాజకీయ రంగ ప్రవేశం, రాజకీయ పార్టీ, రాజకీయ జెండా.. ఇవన్నీ పక్కన పెడితే, అసలు రాజకీయాల్లో రజనీకాంత్‌ రాణించగలరా.? ఇదే ఇప్పుడు తమిళనాడులో హాట్‌ టాపిక్‌. తమిళ సంఘాల వాదన ప్రకారం చూస్తే, రజనీకాంత్‌ స్థానికేతరుడు. స్థానికేతరుడైనంతమాత్రాన రాజకీయాల్లోకి రాకూడదన్న రూల్‌ ఏమీ లేదు. అదే సమయంలో, నాలుగున్నర దశాబ్దాలుగా తమిళనాడులోనే నివాసముంటోన్న రజనీకాంత్‌ స్థానికేతరుడెలా అవుతాడు.? అన్నదీ లెక్కలోకి తీసుకోవాల్సిన విషయమే. 

రాజకీయంగా మాత్రం రజనీకాంత్‌కి 'స్థానికేతరుడు' అంశం చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఇప్పటికే పలు ఆందోళనలు కూడా జరిగాయి. మరి, స్థానికేతరుడన్న విమర్శని రజనీకాంత్‌ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలే. అదే రాజకీయాల్లో ఆయన ప్రస్థానాన్ని డిసైడ్‌ చేస్తుంది.

Show comments