'తెలంగాణ' సెంటిమెంటు...'హోదా' రాజకీయం...!

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఏలూరులో నిర్వహించిన 'యువభేరీ' కార్యక్రమంలో ఓ మాటన్నారు. ఏమిటది? 'తెలంగాణ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కాని కేసీఆర్‌ పట్టుబట్టారు. చివరకు అనుకున్నది సాధించారు. అలాగే ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు పట్టుబడితే ఎందుకు దక్కించుకోలేం? ఈ విషయంలో వైసీపీ నిర్విరామ పోరాటానికి సిద్ధంగా ఉంది' అని చెప్పారు. జగన్‌ చెప్పింది బాగానే ఉంది. కాని ప్రత్యేక తెలంగాణతో ప్రత్యేక హోదాను పోల్చలేం. రెండూ పొంతన లేని సమస్యలు. 

ఇంకా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ అనేది సెంటిమెంటు. ప్రత్యేక హోదా అనేది రాజకీయం. ప్రత్యేక తెలంగాణ దీర్ఘకాలిక డిమాండ్‌. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన కారణంగా పుట్టుకొచ్చిన అంశం. ప్రత్యేక తెలంగాణను కేసీఆర్‌ సాధించినట్లు కనబడుతున్నా, ఆయన ఒక్కడి పోరాటం వల్లనే అది సాధ్యం కాలేదు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే తెలంగాణ కోసం పోరాటాలు సాగాయి. కాకపోతే కేసీఆర్‌ చాలా తెలివిగా తెలంగాణ సెంటిమెంటును మరింత ఎక్కువ రాజేసి ఉద్యమానికి తాను నాయకత్వం వహించాడు. 

నిజానికి ఒక దశలో ఉద్యమం ఆయన చేతి నుంచి జారిపోయి ప్రజల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పోరాట ఘట్టాలు కేసీఆర్‌ లేకుండానే జరిగాయని చెప్పొచ్చు. తెలంగాణ సాధించడం కోసం అన్ని పార్టీలూ ఒక్కటయ్యాయి. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కూడా తన వంతు కృషి చేసింది. ప్రత్యేక తెలంగాణ కేవలం పోరాటం వల్లనే సాధ్యం కాలేదు. ఆల్రెడీ తెలంగాణ ఇవ్వాలని అప్పటి యూపీఏ సర్కారు, ప్రత్యేకించి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పకోవచ్చు. అందుకే రాష్ట్రం ఇచ్చింది సోనియా అని కాంగ్రెసువారంటే, తెచ్చింది కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకుంటారు. ప్రజల్లోనూ ఇదే అభిప్రాయముంది. 

తెలంగాణ కోసం అన్ని పార్టీలు రాజకీయాలకతీతంగా ఉద్యమించినా చివరకు క్రెడిట్‌ కేసీఆర్‌కు దక్కింది. 'ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలూ పట్టుబడితే ఎందుకు దక్కించుకోలేం?'..అని జగన్‌ ప్రశ్నించారు. కాని కుల, వర్గ రాజకీయాలకు పేరు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో కొంపలు మునిగిపోతున్నా రాజకీయ పార్టీలు ఒక్క తాటి మీదకు రావడం అసంభవం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అర్థరాత్రి 'ప్రత్యేక సాయం' ప్రకటించకముందు 'ప్రత్యేక హోదా ఏపీలో సెంటిమెంటుగా మారింది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. కాని అది సెంటిమెంటు కాదని కేవలం రాజకీయమని ఆ తరువాత ప్రత్యేక సాయాన్ని ఆమోదించడం ద్వారా ఆయనే నిరూపించారు.  Readmore!

నిజానికి ప్రత్యేక హోదా ఆంధ్రులకు సెంటిమెంటుగా మారలేదు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనంటూ తెలంగాణలోని అన్ని పార్టీలూ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. అన్ని కలిసి ఉధృత పోరాటం చేశాయి. ఇంతటి కలిసికట్టుతనం ఏపీలో లేదు. ప్రతీ పార్టీ స్వప్రయోజనాల కోసం ఆరాటపడుతోందే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే ఉద్దేశం లేదు. అన్ని పార్టీలూ కలిసి ఉమ్మడిగా పోరాడే ఆసక్తి, ఆలోచన లేవు. ఇతర పార్టీలు కలిసి రావాలని ప్రతీ పార్టీ  అంటుందేగాని అందుకోసం ప్రయత్నాలు సాగవు. 

ప్రధానంగా అధికార పార్టీకి ప్రత్యేక హోదాపై ఆసక్తి లేదు. దీనిపై చంద్రబాబే అనేక రాజకీయాలు చేశారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ఆయనే ఆ తరువాత నాలుక మడతేసి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, రక్తం మరుగుతోందని ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక సాయమే బాగుందని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనలు వ్యక్తమవుతున్నా పెద్దపెట్టున , ఉదృతంగా పోరాటాలు సాగుతున్న దాఖలాలు లేవు.  హోదా సెంటిమెంట్‌ అయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. బహిరంగ సభలు పెట్టి తీవ్రంగా ఆవేశపడిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా కార్యాచరణకు దిగలేదు.

ఏపీలో మరో రెండున్నరేళ్ల వరకు అంటే ఎన్నికల సమయం వరకు ప్రత్యేక హోదాపై రాజకీయాలు సాగుతూనే ఉంటాయి. అన్ని  పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేయడం జరిగే పని కాదనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం  పోరాటానికి నాతో కలిసి రండి అని జగన్‌ పిలుపునిస్తే కాంగ్రెసు రాదు. కాంగ్రెసు పిలుపునిస్తే వైకాపా, కమ్యూనిస్టు పార్టీలు రావు. ఇక ముద్రగడ వంటి నాయకులకు కుల రాజకీయాలే ప్రధానం తప్ప హోదా బాధ అలాంటివారికి పట్టదు. తలో దిక్కుగా ఉన్న రాష్ట్రంలో పట్టుబట్టి హోదా సాధించుకోగలరా? 

Show comments

Related Stories :