మహిళకన్నా.. పార్టీ పరువే ముఖ్యం.?

ఓ మహిళపై ఓ మంత్రిగారు దౌర్జన్యం చేస్తే.. ఇక్కడ పార్టీ పరువు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ముఖ్యమైపోయింది. సాక్షాత్తూ జెడ్పీ ఛైర్మన్‌ ప్రాణాలకే రక్షణ లేకపోతే, ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఎవరికి రక్షణ కల్పిస్తున్నట్లు.? జెడ్పీ ఛైర్మన్‌ టీడీపీ నేత కావొచ్చుగాక. మంత్రిగారూ టీడీపీకి చెందిన వ్యక్తే కావొచ్చుగాక. కానీ, ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయం. ఓ మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. 

ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే పోలీసులు జోక్యం చేసుకోవాలి. కేసులు నమోదవ్వాలి. ముఖ్యమంత్రి స్వయంగా కల్పించుకుని, సదరు మహిళా ప్రజాప్రతినిథికి ప్రాణ సంకటంగా మారినవారెవరన్నదీ ఆరా తీయాలి, అవసరమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధపడాలి. కానీ, ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నది మంత్రిగారు.. పైగా, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. అక్కడే వచ్చింది చిక్కు అంతా. 

అందుకే, పార్టీ పరంగా వివాదాన్ని చల్లార్చేందుకు చంద్రబాబు పార్టీ అధినేత హోదాలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మాత్రందానికి కమిటీ వేయడమెందుకు, సదరు మహిళా ప్రజా ప్రతినిథి పిలిపించి, వార్నింగ్‌ ఇచ్చేస్తే సరిపోతుంది కదా.! తహసీల్దార్‌ వనజాక్షి విషయంలో చంద్రబాబు చేసింది ఇదే మరి. ఆ అనుభవంతో ఇక్కడ గుంటూరు జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ జానీమూన్‌కి వార్నింగ్‌ ఇచ్చేసి, ఆమెదే తప్పని తేల్చేయడం చంద్రబాబుకి పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ, కమిటీ పేరుతో హడావిడి చేయాలి కదా. చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది అదే.

Show comments