సంతలో చిన్న పిల్లాడు దేన్ని చూస్తే దాన్ని కావాలని అడగడం గుర్తుకు వస్తే.. తప్పేం లేకపోవచ్చు ఏపీ ముఖ్యమంత్రి తీరును చూస్తుంటే. వరసగా విదేశీ పర్యటనలు పెట్టుకోవడం.. ఏ నగరానికి వెళితే ఆ నగరంలా అమరావతిని మార్చేస్తానని అనడం, ఆయా నగరాల్లో ఏది గొప్ప గా కనిపిస్తే అలాంటి దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని అనడం… ఆ తర్వాత ఆ సంగతి పూర్తిగా మరిచిపోవడం. గత రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ ప్రహసనం ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఈ వీకెండ్ లో కజకిస్తాన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం అక్కడ కేబుల్ కార్ల పై ముచ్చట పడ్డాడు.
ఇదివరకూ లండన్ వెళ్లినప్పుడు అక్కడి లాంటి ‘లండన్ ఐ’ ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత చైనా వెళ్లినప్పుడు అక్కడి తరహా బుల్లెట్ ట్రైన్ ను అమరావతి నుంచి అన్ని వైపులకూ నడుపుతామని చెప్పిన ఏపీ సీఎం ఇప్పుడు కజకిస్తాన్ రాజధానిలో తిరుగుతున్న కేబుల్ కార్లను అమరావతిలో తిప్పే ఏర్పాట్లను చేస్తామని ప్రకటించారు.కజక్ రాజధానిలో వాటి లో తిరిగిన బాబు.. ప్రయణానుభవం గొప్పగా ఉందని, ఇలాంటివి అమరావతిలో కూడా ఏర్పాటు చేస్తామని అన్నారట.
ఇది వరకూ బుల్లెట్ ట్రైన్ ల విషయంలో చైనా నుంచి ప్రకటనలు చేసిన సమయంలో చాలా విమర్శలే వచ్చాయి. ఏ మాత్రం శాస్త్రీయ అధ్యయనం, బుల్లెట్ ట్రైన్ తో ముడి పడిన ఆర్థిక అంశాలను లెక్కలోకి తీసుకోకుండా బాబు అక్కడ నుంచి ఒక ప్రకటన చేసి ఒక రోజుకు పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేబుల్ కార్ మాటలతో ఒక విదేశీ పర్యటనను పూర్తి చేస్తున్నట్టుగా ఉన్నారు.