బాబుగారి 'సంకల్పం' - ఆ రూటే సెపరేటు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. పెద్దయెత్తున నిధులు విడుదల చేసి, కనీ వినీ ఎరుగని స్థాయిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా. 

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. 'సంకల్పం' పేరుతో, రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టేందుకు చంద్రబాబు గడచిన మూడేళ్ళుగా ప్రయత్నిస్తూనే వున్నారు. ఇప్పుడూ అదే జరగబోతోంది. 'సంకల్పం' అంటే ఏంటి.? ఫలానా పని అనుకుని, దాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవడం సంకల్పం. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా 'సంకల్పాలు' చేపట్టాల్సి వుంది. కానీ, అవేవీ చంద్రబాబు 'సంకల్పం' పరిధిలోకి రానే రావు.! 

ముఖ్యమంత్రి అవ్వాలనే సంకల్పం చెప్పుకున్నారు.. సాధించేశారు. పుత్రరత్నానికి మంత్రి పదవి ఇవ్వాలనే సంకల్పం చెప్పుకున్నారు.. అది కూడా చేసేశారు. ఇంకా చంద్రబాబు మదిలో ఇంకేమి 'సంకల్పాలు' వున్నాయోగానీ, పైకి ఆయన చెప్పే మాటలు వేరేగా వుంటాయి. ప్రత్యేక హోదా రాదు, కేంద్రం ఇవ్వదు.. రాష్ట్రం చెయ్యగలిగేదేమీ లేదు.

ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీ విషయంలో అయినా క్లారిటీ వుండాలి కదా. దానికోసమైనా సంకల్పం చెప్పుకోవాలి కదా.? కానీ, చెప్పరు. చెబితే ఇంకేమన్నా వుందా.? ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహిస్తారు. అద్గదీ అసలు విషయం. 

మొన్నీమధ్యనే మహానాడు సందర్భంగా, ఏదో మాట్లాడాలి కాబట్టి విశాఖలో రైల్వే జోన్‌ ప్రస్తావన తీసుకొచ్చారంతే. మూడేళ్ళవుతోంది, ఇంతవరకు రైల్వే జోన్‌ మీద ఎలాంటి క్లారిటీ లేదాయె. పోనీ, దానికోసమైనా సంకల్పం చెబుతారా.? అంటే, అదీ లేదాయె. రాష్ట్రానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయాలకు 'సంకల్పం'లో చోటు లేనప్పుడు సంకల్పం ఎందుకు.? ఆ సంకల్పం పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు.?

Show comments