కేసీఆర్‌ ఇల్లు కాదు.. ప్రజల ఆస్తి.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాస్తంత ఉద్వేగంగా మాట్లాడారు ఇటీవల కొత్త క్యాంపు కార్యాలయ నిర్మాణం గురించి విపక్షాలు సంధిస్తున్న విమర్శలపై స్పందిస్తూ. 'అది కేసీఆర్‌ ఇల్లు కాదు.. తెలంగాణ ప్రజల ఆస్తి..' అంటూ కేసీఆర్‌ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. వినడానికైతే కేసీఆర్‌ వ్యాఖ్యలు చాలా పవర్‌ఫుల్‌గానే అన్పిస్తాయి. నిజమేనా.? అది తెలంగాణ ప్రజల ఆస్తేనా.? అన్నది ఆలోచిస్తేనే, అసలు విషయం అర్థమవుతుంది. 

అధికారిక భవనాలేవైనా అవి ప్రభుత్వ ఆస్తులే అవుతాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, అవి ప్రజల ఆస్తులెలా అవుతాయి.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌, ఆ ఖరీదైన క్యాంప్‌ కార్యాలయంలో ఎంజాయ్‌ చేయగలరుగానీ, సామాన్యులకు అందులో వుండే హక్కు లేదు కదా.! పైగా, కొత్త ముఖ్యమంత్రి వస్తే, తన ఇష్టానికి దాన్ని కూలగొట్టి, ఇంకోటి కట్టేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. తమ మూఢ నమ్మకాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, దాన్ని 'కవర్‌' చేసుకోడానికి, 'ప్రజల ఆస్తి' అని కలరింగ్‌ ఇవ్వడంలో 'నైతికత' ఏముంటుంది.? ఛాన్సే లేదు. 

రాచరికపు రోజుల్లో రాజు తలచుకుంటే ప్రజల్ని కూలీలుగా మార్చేసి, పెద్ద పెద్ద కోటలు కట్టేసేవారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే.. ప్రజల్ని కూలీలుగా మార్చట్లేదుగానీ, ప్రజాధనాన్ని మాత్రం తమ డాబు కోసం వాడుకుంటున్నారంతే. పది కోట్లో, పాతిక కోట్లో, యాభై కోట్లో.. వంద కోట్లో.. వాటిని ప్రజలకు ఉపయోగిస్తే, దాని వల్ల కాస్తో కూస్తో ప్రజలు బాగుపడ్తారు. ఇంకా నయ్యం, అలా చేస్తే తమ డాబు ఏమైపోవాలి.? 

కేసీఆర్‌ సాబ్‌.. ఉద్వేగంగా ప్రసంగించేయడం కాదు, ప్రజలూ ఆలోచించగలరని జర్ర సోచాయించండి.!

Show comments