మున్సిపల్ ఎన్నికలపై 'బ్లాక్' ముద్ర?

జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. విశాఖ కార్పొరేషన్, కాకినాడ మున్సిపాల్టీ లాంటి ప్రతిష్టాత్మక స్థానాలు ఈ ఎన్నికల్లో భాగమే. సహజంగా అధికారంలో వున్న పార్టీ కాబట్టి, డబ్బులు వెదజల్లడానికి పెద్దగా సమస్య వుండదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ అధిష్టానం ముందు తమ తమ పరువు ప్రతిష్టలు కాపాడుకునేందుకు కూడా తమ జేబుల్లోంచి డబ్బులు తీయాల్సి వుంటుంది. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది పెద్ద విషయం కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సునాయాసంగా కోట్లు కుమ్మరించేయగలరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఉన్న నల్లధనం అంతా మాయమవుతున్న పరిస్థితి. 

కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకున్నవారు ఇక ఆస్తులు అమ్మి డబ్బులు తేవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వెనుక పెట్టిన డబ్బులేవీ అక్కరకు రాకుండా పోయాయి. అందువల్ల ఎవరు ఆస్తులు అమ్మి పైసలు తేగలరో వారికే టికెట్ లు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే సమయంలో పార్టీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యతలు స్వీకరించాలి. కానీ వారు కూడా భారం ఎవరిమీద వేయాలి? కాంట్రాక్టర్ల మీద. కానీ వారు కూడా డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి. బ్యాంకుల్లో దాచుకున్నవైనా తీయక తప్పదు. లేదా తమ తమ ప్రాపకాల కోసం, మొహమాటాల కోసం ఆస్తులు అమ్మి డబ్బులు సర్దుబాటు చేయక తప్పదు. 

అందువల్ల ఈసారి మరీ భారీగా ఖర్చు చేసే పరిస్థితి వుంటుందా అన్నది అనుమానం. నీ చిరకాలంగా అలవాటు పడిన జనం నోట్లు లేకుండా ఓట్లు వేస్తారా? అన్నదీ అనుమానం నాయకులను పట్టి పీడిస్తుంది. అందువల్ల కిందా మీదా అయిపోవడం తప్పదు. ఇలాంటి నేపథ్యంలో జరిగే ఎన్నికలు కచ్చితంగా అధికార పార్టీకి సవాలే. 

దీనికి తోడు, భాజపాపై వున్న వ్యతిరేకత ఎన్నికల్లో తమ విజయంపై ప్రభావం చూపించకుండా అధికార తెలుగుదేశం పార్టీ చూసుకోవాల్సి వుంటుంది. నల్ల డబ్బు ఇబ్బందులు ఎదుర్కొన్న పెద్దల సంగతి ఎలా వున్నా, పెళ్లిళ్లు ఆగిపోయి, వ్యాపారాలు పడిపోయి, కూలిపనులు దొరక్క పడ్డ ఇబ్బందులు సహజంగా ఎన్నికల టైమ్ లో గుర్తుకు వస్తే మాత్రం ఫలితం వేరుగావుంటుంది. ఆ సమస్యను అధిగమించాలంటే మరిన్ని డబ్బులు కుమ్మరించాల్సి వుంటుంది. మళ్లీ అక్కడ కథ మొదటికి వస్తుంది. అందువల్ల ఎలా చూసుకున్నా, మున్సిపల్ ఎన్నికల మీద నల్ల నోట్ల రద్దు వ్యవహారం ప్రభావం చూపించే అవకాశం వుంది.

మరోపక్క అయిదు వందలు, వెయ్యి నోట్లు జనవరిలోగా అందుబాటులోకి వస్తే ఫరవాలేదు. కానీ అలా రాకపోతే, ఓటర్లకు ఏకంగా రెండువేల ఓట్లు చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో? అది మరీ కష్టం.

Show comments