పవన్‌... దేశానికి ప్రధాని ఎవరు?

దేశానికి ప్రధాని ఎవరు? అనే ప్రశ్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ను అడగాలా? చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతాడు కదా. నిజమే...చెబుతాడు. కాని పవన్‌ కళ్యాణ్‌కు తెలియదేమోనని అనుమానం. ఇదొక్కటే కాదు, ఆయనకు చాలా విషయాలు తెలియవని,  సినిమాటిక్‌ ఆవేశం తప్ప అవగాహన లేదని కాకినాడలో నిర్వహించిన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ' ద్వారా అర్థమైపోయింది. పవన్‌ కళ్యాణ్‌ దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అనుకోవడంలేదు. మన ముప్పవరపు వెంకయ్యనాయుడని అనుకుంటున్నాడు. ఒకప్పుడు డీకే బారువా అనే కాంగ్రెసు నాయకుడు 'ఇందిరాయే ఇండియా...ఇండియాయే ఇందిర' అనే నినాదమిచ్చాడు. ఇందిరాగాంధీ మీద ఉన్న అపారమైన భక్తితో ఆ నినాదమిచ్చాడనుకోండి. అది వేరే విషయం. 

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కేంద్ర ప్రభుత్వమే వెంకయ్య నాయుడు అని, వెంకయ్య నాయుడే కేంద్ర ప్రభుత్వమని అనుకుంటున్నాడు. సభలో ఎక్కువసార్లు పేరు పెట్టి మరీ విమర్శించింది వెంకయ్య నాయుడినే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఆయనే కారణమని పవన్‌ అభిప్రాయం. అసలు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం వెంకయ్యకే ఉందని, ఆయన గట్టిగా పట్టుబట్టివుంటే హోదా చచ్చినట్లు వచ్చేదని పవన్‌ అనుకుంటున్నాడు.ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓ అంశం మీద మంత్రులంతా కలిసి చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకునేది కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి. 

ఆ నిర్ణయాన్ని సంబంధిత మంత్రి, అధికార యంత్రాంగం అమలు చేసి తీరాల్సిందే. మంత్రివర్గ సమావేశాల్లో, ఇతర భేటీల్లో మంత్రులు తమ తమ అభిప్రాయాలు చెబుతారు. ఆలోచనలు, సవరణలు మొదలైనవి ప్రధాని/ముఖ్యమంత్రి ముందు ఉంచుతారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక, రాజకీయంగా కూడా ఆలోచించాక తుది నిర్ణయం వెలువడుతుంది. ఆ నిర్ణయం కొందరు మంత్రులకు ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేదు. 'ఈ నిర్ణయం నాకు ఇష్టం లేదు. గవర్నమెంటులో ఉండను' అని బయటకు రారు కదా. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ప్రధాని మోదీ నిర్ణయించారు. 

ఇది వెంకయ్యకు ఇష్టం లేకపోయినా ఏదోవిధంగా దాన్ని సమర్థించక తప్పదు. అందుకే ఆయన ఆ పని చేస్తున్నారు. ఆనాడు పార్లమెంటులో ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలంటూ వెంకయ్య పట్టుబట్టిన మాట వాస్తవమే. ఎందుకు? ఏపీ ఆయన రాష్ట్రం కాబట్టి. అలా పట్టుబట్టడం కూడా పార్టీ వ్యూహమే. ఆనాడు వెంకయ్య పట్టుబట్టారు కాబట్టి హోదా ఇచ్చే అధికారం ఆయనకే ఉందని, ఉండి కూడా ఇవ్వలేదని పవన్‌ అనుకున్నాడేమో....! అసలు కారకుడైన మోదీ పేరెత్తకుండా వెంకయ్య మీద వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా అదే పనిగా విమర్శించాడు. 

మోదీ పేరెత్తకపోవడానికి కారణమేమిటి? ఆయన ప్రధాని అని తెలియదా? ఇంకేమైనా ప్రయోజనాలు, భయాలు ఉన్నాయా? రెండు పాచిపోయిన లడ్డూలను కేంద్రం ఇచ్చిందని చెప్పడంలో అర్థమేమిటో తెలియదు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి నామం పెట్టి 'ప్రత్యేక సాయం' మాత్రమే చేస్తామని అరుణ్‌ జైట్లీ అర్థరాత్రి ప్రకటించారు. దీనికి రెండు పాచిపోయిన లడ్డూలు అని చెప్పడం ఎందుకు? ప్రసంగం ప్రారంభంలోనే వెంకయ్య నాయుడిని ఉద్దేశించి లడ్డూల విషయం హిందీలో చెప్పాడు పవన్‌. వెంకయ్య తెలుగోడే కదా. హిందీలో చెప్పడమెందుకు? మోదీని విమర్శించి హిందీలో ఎద్దేవా చేస్తే అదొక అందం...చందం. కాని ఆ పని చేయలేదు. 

ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు మొర్రో అని కేంద్రం తెగేసి చెప్పిన తరువాత కూడా 'ఇస్తారా..లేదా చెప్పండి' అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. పాచిపోయిన లడ్డూలు తీసుకోవద్దని, కేంద్రం మొహాన విసిరికొట్టాలని చంద్రబాబుకు పవన్‌ సలహా ఇచ్చాడు. 'లడ్డూలు పాచిపోయినా ఇప్పడున్న పరిస్థితిలో ఇదే మహాప్రసాదం' అనుకుంటూ చంద్రబాబు తీసుకున్నారు. ఆ విషయాన్ని అర్థరాత్రి దాటాక ప్రకటించారు. నిన్న అసెంబ్లీలో కూడా వివరంగా పాయింట్‌ టు పాయింట్‌ చెప్పారు. పవన్‌ మాట్లాడినదాన్ని బట్టి ఈ విషయాలేవీ ఆయనకు తెలియవని, అప్‌ టు డేట్‌గా లేడని అర్థమవుతోంది. 

ప్రత్యేక హోదా ఇక రాదని, వచ్చిన సాయాన్ని బాబు కాదనలేడని పవన్‌ తెలుసుకోవాలి. ఆయన ప్రసంగంలో తెచ్చిపెట్టుకున్న ఆవేశం తప్ప అసలు 'పస' తక్కువ. పోరాటం చేస్తా...చేస్తా..అని గొంతు చించుకున్నాడేతప్ప కార్యాచరణ చెప్పలేదు. వ్యూహం చెప్పకుండా ఏవేవో మాట్లాడాడు. కాకినాడ సభను తిరుపతిలోనే ప్రకటించిన ఈ హీరో కాకినాడలో మరో సభ గురించి ఎందుకు ప్రకటించలేదు? హోదా సాధించడంలో అందరూ ఫెయిలయ్యాక తాను రంగంలోకి దిగుతానన్నాడు. 'ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం ఎత్తుతాను' అని దేవుడు చెప్పాడట...! అంటే ఈయన హోదా సాధించే దేవుడా? సలక సామాజిక, రాజకీయ శాస్త్రాలు తనకు తెలుసునని చెప్పుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముందు ఆ పని చేస్తే మంచిది. 

Show comments