ఆ ఇద్దరూ వైసీపీ ఎంఎల్ఏలు జంప్‌ చేస్తారా...!

సిక్కోలు వైసీపీలో ఇపుడు మరో కలకలం రేగుతోంది. జిల్లాలో వైసీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం చెలరేగడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతిలకు జిల్లాకు చెందిన కొత్త మంత్రి, సీనియర్‌ నేత కళా వెంకటరావుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా త్వరలోనే సైకిల్‌ ఎక్కేస్తారంటూ రెండు పార్టీలలో చర్చ సాగుతోంది. నిజానికి చాలా కాలం క్రితమే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ, సమీకరణలు కుదరకపోవడంతో పాటు, టీడీపీలో వారి ప్రత్యర్థులైన మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి, నిమ్మక జయకృష్ణ అడ్డుచెప్పడం వల్ల ఆగిపోయిందంటారు. ఇపుడు ఎటూ కళా మంత్రి అయ్యారు. ఆయన వ్యవహారం కూడా దూకుడు మీద ఉంది, పార్టీ అధినాయకత్వానికి చాలా దగ్గరివారన్న పేరు ఉంది. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేయడం ద్వారా జిల్లాలో రాజకీయంగా పార్టీని బలోపేతం చేశానని చెప్పుకోవడం, మార్కులు కొట్టేయడం కోసం కళా గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 

ఇక, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో ఎటూ గెలవరన్న మాట కూడా వినిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్‌ కూడా వీరి పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలోనే కేవలం 512 ఓట్ల స్వల్ప తేడాతో జోగులు ప్రతిభా భారతి మీద గెలిస్తే, కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ మీద 1620 ఓట్ల తేడాతో నెగ్గారు. ఈ క్రమంలో మరోసారి ఈ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందన్న గ్యారంటీ లేదు. దాంతో, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్‌ చేసి రానున్న రోజులలో ఉన్న అధికారాన్ని కొంతైనా అనుభవించాలనుకుంటున్నట్లుగా టాక్‌. వచ్చే నెలలో విశాఖలో జరిగే మహానాడులోగా ఈ వ్యవహారం తేలనుంది.

Readmore!
Show comments

Related Stories :