'కబాలి' నష్టాలెంత.?

స్టార్‌ హీరోతో సినిమా పట్టాలెక్కితే చాలు.. పబ్లిసిటీతో అంచనాలు పెంచేయొచ్చు.. మార్కెటింగ్‌ ట్రిక్స్‌తో సినిమాని అమ్మేయొచ్చు.. టేబుల్‌ ప్రాఫిట్స్‌తో సేఫ్‌ అయిపోవచ్చు.. ఆ తర్వాత చూసే ప్రేక్షకులు ఏమైపోతేనేం.? సినిమాని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏమైపోతేనేం.! 

సినిమా రంగంలో నయా పోకడ ఇది. స్టార్‌ హీరో, స్టార్‌ డైరెక్టర్‌.. ఈ కాంబినేషన్ల గురించి తప్ప, కథ - కాకరకాయ వంటి ఆలోచనలే చేయడంలేదు. హైప్‌ని పెంచే టైటిల్‌, ఆ హైప్‌ని పదింతలు చేసే ప్రమోషన్‌ ట్రిక్స్‌.. వీటి గురించే దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. హీరోలదీ అదే దారి. అందుకే, ఎలాగోలా హిట్టయిన సినిమాలు కూడా నిర్మాతల్ని నిలువునా ముంచేస్తున్నాయి. అన్నట్టు, ఇక్కడ నిర్మాత మునిగిపోవడం కన్నా దారుణంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మునిగిపోవడం ఎక్కువైపోయింది. ఆ తర్వాత, ఆ దెబ్బ నిర్మాత నెత్తిన పడి, టేబుల్‌ ప్రాఫిట్లు కరిగించేసుకోవాల్సి వస్తోంది. 

ఒక్కోసారి హీరో, దర్శకుడు కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఆదుకుంటున్నారంటే, సినిమా రంగంలో వింత పోకడ, ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. 

అసలే దెబ్బ మీద దెబ్బ తగులుతోంది రజనీకాంత్‌ సినిమాలకి. ఈ టైమ్‌లో రజనీకాంత్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం 'కబాలి' కూడా మరో దెబ్బ కొట్టేసింది. నష్టాల్ని పూడ్చుకునేందుకు 'కొచాడియాన్‌', 'లింగా' నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇప్పటికే రజనీకాంత్‌ ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఆ లైన్‌లోకి తాజాగా 'కబాలి' బాధితులు చేరిపోనుండడం ఖాయమైపోయింది. ఇక్కడితో సినిమా అయిపోలేదు, 'రోబో 2.0' నిర్మాతలు కూడా ఇప్పుడే బెర్త్‌ కన్‌ఫర్మ్‌ చేసుకుంటే బెటరేమో.! 

రజనీకాంత్‌ గెటప్‌, రజనీకాంత్‌ అనారోగ్యం, రజనీకాంత్‌ పాపులారిటీ.. వీటినే పెట్టుబడిగా పెట్టేసి 'కబాలి'పై అంచనాల్ని పెంచేశారు. సినిమా విడుదలయ్యాక అంతా 'ఉత్తుత్తే' అని తేలిపోయింది. తాపీగా ఇప్పుడు నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టాల్ని అంచనా వేసుకోవడంలో నిమగ్నమైపోయారు. సినిమా విడుదలైన రెండో రోజుకేనా.? అనడక్కండి, నిన్న సాయంత్రం నుంచే ఆ పని మొదలయ్యిందట. దటీస్‌ కబాలి.. ఈ దెబ్బకు అంతా బలి.

Show comments