లోకేష్‌బాబూ.. అప్పుడే లక్ష తగ్గిందా.?

అరరె, మొన్నేమో 2019 నాటికి ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల్ని కల్పించి తీరతామన్నారు.. ఇప్పుడేమో, 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల్ని కల్పిస్తామంటున్నారు.! చంద్రబాబే కాదు, చినబాబుకీ మాట మీద నిలకడ వుండదన్నమాట.! 

ఆగండాగండీ, మంత్రి అయ్యాక కేవలం 90 రోజుల్లోనే 3 వేల ఉద్యోగాల్ని ఐటీ రంగంలో తీసుకొచ్చారట నారా లోకేష్‌. అదిరిందయ్యా లోకేషూ.. 90 రోజులు 3 వేల ఉద్యోగాలు.. అద్భుతః అనేసి, ఆకాశానికెత్తెయ్యాలేమో.! ఎమ్మెల్యేగా గెలిచే ధైర్యం లేక, ఎమ్మెల్సీగా నామినేటెడ్‌ పదవి తెచ్చుకుని.. మంత్రి అయినట్టుండదు ఉద్యోగాల వ్యవహారం. 

ప్రజల్లోకి వెళ్ళి నాయకుడిగా నిరూపించుకుని, ప్రజామోదంతో ప్రజా ప్రతినిథి అయితే కదా.. ఉద్యోగమంటే ఏంటో తెలిసొచ్చేది. అందుకే, ఒక్కోసారి లక్ష అంటారు, ఇంకోసారి రెండు లక్షలంటారు.. నోటికి ఎంతొస్తే అంతే.. అడిగేదెవరు.? ప్రశ్నించి నిలదీసేదెవరు.? మూడు నెలలు తిరగకుండానే రెండు లక్షల ఐటీ ఉద్యోగాలన్న నోరు, లక్ష ఐటీ ఉద్యోగాలకు పడిపోయిందంటే.. రానున్న రోజుల్లో, ఆ లక్ష కాస్తా ఏ పది వేల దగ్గరో ఫిక్స్‌ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

విజయవాడ కేంద్రంగా నారా లోకేష్‌ ఇప్పటికే పలు ఐటీ సంస్థల్ని ప్రారంభించారు మంత్రి హోదాలో. తాజాగా మరికొన్ని ఐటీ సంస్థల కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేసేశారాయన. మంత్రి కదా, ఆ మాత్రం పబ్లిసిటీ వుండాల్లెండి. కంపెనీలు ప్రారంభమవుతున్నాయి సరే, అవి నడుస్తున్నాయా.? అందులో కొత్తగా ఉద్యోగాల లభ్యత వుందా.? ఏమో మరి.!

కొసమెరుపు: వర్ధంతికీ, జయంతికీ తేడా తెలియదు సరే.. ఒక లక్షకీ, రెండు లక్షలకీ తేడా తెలియకపోతే ఎలా చినబాబూ.?

Show comments