సోనియాగాంధీ వద్ద దేబిరించారు.. మేడం మేడం.. అంటూ బతిమాలుకున్నారు.. బిచ్చమెత్తుకోవాల్సిన ఖర్మేంటి.? అడుక్కోవడమేంటి.? అంటూ ఆవేశంతో పవన్‌కళ్యాణ్ ఊగిపోయారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీల్ని, ఆనాటి కేంద్ర మంత్రుల్ని బిచ్చగాళ్ళతో పోల్చేశారు పవన్‌కళ్యాణ్. ఏదో ఫ్లోలో అలా అనేశారుగానీ, ఆ గ్యాంగ్‌లో తన అన్నయ్య.. తనకు ప్రాణం కన్నా ఎక్కువైన, తనకు తండ్రి లాంటి అన్నయ్య కూడా వున్నారని పవన్‌కళ్యాణ్ ఎలా మర్చిపోయారబ్బా.?
అదే సోనియాగాంధీ పాదాల వద్ద చిరంజీవి, తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని తాకట్టు పెట్టేశారు. చిరంజీవి తాకట్టు పెట్టేసింది ప్రజారాజ్యం పార్టీని మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. రాజకీయాల్లోకి వచ్చేవారందరికీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది మరి. ఎవరైనాసరే, 'తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం..' అంటూ రాజకీయాలు చేయాల్సిందే. నాన్సెన్స్ అంటే ఇదే మరి.!
ఎవరి రాజకీయ అవసరాలు వారివి. ముఖ్యమంత్రి అయిపోదామనుకున్నారు, పార్టీ పెట్టారు.. దానికి తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం.. అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలి, ప్రజల్ని వంచించి, ప్రజల నమ్మకాల్ని వమ్ము చేసి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపేసి, చిరంజీవి కేంద్ర మంత్రి అయిపోయారు. ఆ తర్వాత చిరంజీవి విభజనకు తాను వ్యతిరేకమన్నారు.. సోనియా దగ్గరకెళ్ళి జీ హుజూర్ అన్నారు. ఇదంతా జనం మర్చిపోయారని పవన్‌కళ్యాణ్ అనుకుంటే ఎలా.?
ముందు చిరంజీవి, సంస్కరించడం.. అంటూ తన కుటుంబం నుంచే ఆ పని చేసి వుండాలి. టీడీపీ ఎంపీలనో, బీజేపీ ఎంపీలనో విమర్శించే ముందు, అన్నయ్యని నిలదీస్తాడో, అన్నయ్య తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణే చెప్తాడో.. ఆ తర్వాతే, పవన్‌కళ్యాణ్ మిగతా రాజకీయాల గురించి మాట్లాడితే మంచిదేమో.!
'పోన్లే ఎవరో ఒకరు మాట్లాడటం మంచిదే కదా..' అని ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పవన్‌కళ్యాణ్ లాంటోళ్ళని నమ్ముతోందంటే.. వాళ్ళ చిత్తశుద్ధి మీద నమ్మకంతో కాదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా తయారైంది.. ఇలాంటి రాజకీయ నాయకుల కారణంగా. గొంతు కోసినోళ్ళే, తమను ఉద్ధరించకపోతారా.? అని బీజేపీ - టీడీపీని అధికార పీఠమెక్కించలేదా.? పవన్‌కళ్యాణ్ విషయంలో అయినా కాస్తో కూస్తో ఆశలున్నదీ అందుకేనేమో.!
మొత్తమ్మీద, ఆవేశంలో కాంగ్రెస్ నేతల మీద తెగ 'చిరాకు' పడిపోయిన పవన్‌కళ్యాణ్‌కి, చిరంజీవి నుంచి ఈ పాటికి ఫోన్ కాల్ వచ్చే వుండాలి. 'నన్నే అంతమాట అనేస్తావా.? నన్ను బిచ్చగాడ్ని చేసేస్తావా.? నాకు హిందీ రాదంటావా.?' అని చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించేస్తే ఏంటి పరిస్థితి.! అఫ్‌కోర్స్, రాజకీయాల్లోకొచ్చాక.. చిరంజీవి కూడా 'దులుపుకుపోవడం' అలవాటు చేసేసుకునే వుంటార్లెండి.