భారతీయ జనతా పార్టీ ముందు బానిస బతుకు బతకాలనుకుంటే.. అది చంద్రబాబు వ్యక్తిగతం. కానీ, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హోదాలో, ఐదున్నర కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి వుంటుంది. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌కి ఆ అదృష్టం లేకుండా పోయింది.
'కేంద్రం ఏమిస్తే అది తీసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం..' అన్న మాట ఒక్కటి చాలు.. చంద్రబాబు, కేంద్రానికి ఎంత బానిసలా మారిపోయారో చెప్పడానికి. శకుని, తన తండ్రి అస్తికలతో పాచికల్ని తయారుచేస్తే, ఆ పాచికలు శకుని చెప్పినట్లుగా ఆడతాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే పాచికలా మారిపోయారు. బీజేపీ పాచికల్ని విసురుతోంది.. ఆ పాచికల రూపంలో చంద్రబాబు దొర్లుతున్నారంతే.
మొత్తం కథ చూస్తోంటే, ఓటుకు నోటు కేసు వెనుక తెలంగాణ ప్రభుత్వం కాదు, ప్రధాని నరేంద్రమోడీనే చక్రం తిప్పారని అన్పించకమానదు. ఆ కేసు తర్వాతే చంద్రబాబులో స్పష్టమైన మార్పు వచ్చింది. అప్పటినుంచే చంద్రబాబు బానిసలా తయారయ్యారు కేంద్రానికి. కేంద్రం ఎలా చెబితే, అలా నడుచుకుంటున్నారు తప్ప, తానొక రాష్ట్రానికి ముఖ్యమంత్రినన్నట్లు ఏనాడూ ఆయన వ్యవహరించిన దాఖలాల్లేవు. కొద్ది రోజుల క్రితమే ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. అంతలోనే, ఇదిగో చంద్రబాబు ఇలా నీరుగారిపోయారు.
ముందే చెప్పుకున్నాం కదా.. బీజేపీ ముందు చంద్రబాబు సాగిలా పడితే అది ఆయన వ్యక్తిగతం. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ ముఖ్యమంత్రి, ఇంకొకరి ముందు మోకరిల్లడాన్ని తట్టుకోలేకపోతోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారో, కేంద్రాన్ని నిలదీస్తారో.. ఏం చేస్తారో, చెయ్యగలరో లేదోగానీ.. చంద్రబాబు బానిసత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ క్షమించబోరు.