బాలయ్య.. మరో నియోజకవర్గం చూసుకుంటున్నాడా!

తన సినిమాల ప్రచారం సందర్భాల్లో కూడా నందమూరి బాలకష్ణ చాలా గట్టిగా చెబుతూ ఉంటాడు. తను తన నియోజకవర్గ ప్రజలకు చాలా సేవ చేసేస్తున్నాను అని! అక్కడ సినిమా గురించి మాట్లాడి సరిపెడితే చాలనుకునే సందర్భాల్లో కూడా బాలయ్య హిందూపురం ప్రస్తావన తెచ్చి తన గొప్పదనం గురించి చెప్పుకొంటూ ఉంటారు. ఇక కొంతమంది టీవీ యాంకర్లు కూడా.. బాలయ్య హిందూపురం నియోజకవర్గం ప్రజలకు అపారమైన సేవలు చేస్తున్నారని, రాజకీయ నేతగా ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నాడని.. అదని, ఇదనీ.. డబ్బా కొడుతూ ఉంటారు!

అక్కడి ఈ టీవీ యాంకర్లు  హిందూపురం వరకూ వెళ్లి చూసొచ్చిట్టుగా చెబుతూ ఉంటే, ఆ మాటలు వినే బాలయ్య నియోజకవర్గ ప్రజలకు చిర్రెత్తుకురావడం పెద్ద విశేషం కాదు. మరి మీడియా భజంత్రీల సంగతలా ఉంటే.. బాలయ్య నియోజకవర్గంలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో.. యావత్‌ తెలుగు ప్రజలందరికీ స్పష్టం అయ్యింది. సినిమాల్లో హీరో అయిన బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 'వసూళ్లు' జరుగుతున్నాయని స్వయంగా తెలుగుదేశం వాళ్లే స్పష్టం చేశారు.

గత రెండున్నరేళ్ల పరిణామాలన్నింటినీ ఏకరువు పెట్టారు. ఆఖరికి వికలాంగుల పెన్షన్లకు, రేషన్‌ కార్డులకు కూడా అక్కడ ఒకరేటు ఉందని, ఆ రేటు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని స్పష్టం అయ్యింది! ఇంతకన్నా నిస్సిగ్గు అంశం మరోటి లేదనే చెప్పాలి. సినిమా సినిమానే.. వాస్తవం వాస్తవమే అని అందరూ అర్థం చేసుకోవాలి. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఇదంతా ఎప్పుడో అర్థం అయ్యింది. ఇప్పుడు అందరికీ అర్థం అయ్యింది.

మరి పీఏ శేఖర్‌ చేసిన వసూళ్ల బాలయ్య కుటుంబానికి కూడా వాటా ఉంది.. అని కూడా తెలుగుదేశం నేతలు కొంతమంది కుండబద్ధలు కొట్టారు. బాలయ్య భార్య వసుంధరకు శేఖర్‌ చెల్లింపులు చేసుకున్నాడని.. ఆమె అండతోనే పేట్రేగిపోయాడని.. వారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇదంతా బాలయ్యకు తెలియకుండా జరిగింది.. అనే వాదనను వినిపించవచ్చుగాక. మరి తన నియోజకవర్గంలో, తన పీఏ ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడా ఈ ఎమ్మెల్యే? అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

Readmore!

ఎలాగైతేనేం.. బాలయ్య పీఏను సాగనంపారు! ఎప్పుడు? రెండున్నరేళ్ల తర్వాత! సగం వ్యవధి పూర్తిఅయ్యాకా.. మరి ఇన్నాళ్లూ భరించిన వారి పరిస్థితి ఏమిటి? బాలయ్య వంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే.. నియోజకవర్గానికి అదనంగా ఏదో జరుగుతుంది, నియోకవర్గం గతి మారిపోతుంది.. అభివద్ధి ఉరకలెత్తుతుంది.. అని స్థానికలు ఆశించడం ఏమాత్రం తప్పుకాదు. అలాంటి ఆశలే బాలయ్యకు మెజారిటీని తెచ్చిపెట్టాయి. ప్రత్యర్థిపై విజయాన్ని చేకూర్చిపెట్టాయి.

మరి అదనంగా అభివద్ధి జరగడం ఒకకల. ఎమ్మెల్యే హోదాలో బాలయ్య తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం మరోవ్యథ. ఇలా ఆయన చెంచాలు చేసే వసూళ్లు అదనపుభారం! బాలయ్యకు రాజకీయ జన్మను ఇచ్చినందుకు ఇదీ హిందూపురం నియోజకవర్గానికి దక్కింది. ఇంత కన్నా అవమానం, అసహనానికి కారణం అయ్యే అంశం ఏముంటుంది?

ఈ నేపథ్యంలో పరిశీలకులు ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బాలయ్య వేరే నియోజకవర్గం చూసుకోవచ్చనే మాట వినిపిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిందానిపై అందరికీ క్లారిటీ వచ్చింది, ఆఖరికి సొంతపార్టీ నేతలు రోడ్డుకుఎక్కారు.. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం మీద ఆధారపడిన హిందూపురం ప్రాంతం రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి అంశాల మీద కూడా చాలా ఆశలు పెట్టుకుని తెలుగుదేశానికి ఓటేసింది.

ఆ వ్యవహారాల్లో మిగతా రాష్ట్రంలో ఎలాంటి అసంతప్తి ఉందో, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత పేరుకుందో.. హిందూపురంలోనూ అదే స్థాయి అసంతప్తి, వ్యతిరేకత ఉంది. దానికి అదనంగా.. ఎమ్మెల్యే  అందుబాటులో లేకపోవడం, ఆయన చెంచాలు వసూళ్లకు పాల్పడటం, కాంట్రాక్టర్లపై దౌర్జన్యం చేయడం.. అదనపు అర్హతలు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేయకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఎలాగూ ఇక్కడ బాలయ్యకు వైకాపా తరపు నుంచి నవీన్‌నిశ్చల్‌ లాంటి స్థానికుడు గట్టి పోటీదారుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో.. బాలయ్య హిందూపురాన్ని వదులుకుని, కష్ణాజిల్లా వైపు వెళ్లొచ్చనే మాట ఇప్పటికే వినిపిస్తోంది! మరేం జరుగుతుందో.

Show comments