ఈ రవిబాబున్నాడే.. మామూలోడు కాదు సుమీ.!

'అల్లరి' పేరుతో పొట్ట చెక్కలయ్యే కామెడీ మూవీ తీసినా, 'అమరావతి', 'అనసూయ' లాంటి థ్రిల్లర్‌ సినిమాలు తీసినా.. అది రవిబాబుకే చెల్లింది. ''అన్ని ప్రయత్నాలూ సక్సెస్‌ అవ్వాలనే కోరుకుంటాం, కొన్ని సక్సెస్‌ అవుతాయి.. కొన్ని అవవు.. అంతే తేడా, ప్రయత్న లోపంలో ఏమాత్రం తేడాలుండవు..'' అని చెబుతుంటాడు రవిబాబు. 'అల్లరి'ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్న రవిబాబు అడపా దడపా సినిమాల్లో నటిస్తుంటాడు, వీలు చిక్కినప్పుడల్లా దర్శకుడిగా సత్తా చాటుతుంటాడు. 

గత కొంతకాలంగా 'పంది పిల్ల'తో సందడి చేస్తున్నాడు రవిబాబు. మేటరేంటంటే, 'పంది'తో ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు 'అదిగో'. తన సినిమా ప్రమోషన్‌ కోసం ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు రవిబాబు. దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురైన కరెన్సీ సంక్షోభం కారణంగా బ్యాంకుల ముందు క్యూలైన్లు కామన్‌ అయిపోయాయి. ఆ క్యూలైన్‌లో తన పంది పిల్లతో పాటు కన్పించి సందడి చేశాడు రవిబాబు. 

తాజాగా, తన పంది పిల్ల.. అదేనండీ 'అదిగో' సినిమాని వేసవి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే, రవివాఉ పందిపిల్ల మెడ మీద కత్తి పెట్టాడండోయ్‌. కాస్త దూరంగానే అయినా, ఆ కత్తి మీద 'సమ్మర్‌' అని రాయడంతో, సినిమాపై కొత్త అనుమానాలు షురూ అయ్యాయి. ఇదేదో కామెడీ సినిమా అనుకున్నారంతా. కానీ, ఇప్పుడిది 'హర్రర్‌' సినిమానా.? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. 

ఏమో, రవిబాబు ఎలాగైనా షాకివ్వగలడు. పంది పిల్లతో కామెడీ చేస్తాడో, హర్రర్‌ ఫిలిం తీసి థ్రిల్‌కి గురిచేస్తాడో.. అసలు పంది పిల్లతో ఏం చేస్తాడో.. వేచి చూడాల్సిందే.

Show comments