కేసీఆర్ వీక్ పాయింట్ పై తలా ఒక పోటు!

ఎందుకు అన్నాడో కానీ.. కాంగ్రెస్ నేతలకు భలే దొరికిపోయాడు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ప్రతిపక్షాలు ఏడెనిమిదీ సీట్లకు పరిమితం అవుతాయని ..  ఈ మేరకు తమ సర్వేలో తేలిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.  కేసీఆర్ సర్వేలో నిజానిజాల సంగతి, ఆ సర్వే తీరులో శాస్త్రీయత ఏమో కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. రోజుకు ఒకరుగా బాధ్యతలు తీసుకుని కేసీఆర్ దమ్ము గురించి వీరు ప్రశ్నిస్తున్నారు.

సర్వే చేయించి, అంత ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు దమ్ముంటే.. తమ పార్టీ నుంచి తీసుకెళ్లిపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని వీరు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగడం కాదు..  కేసీఆర్ ముందు తనవైపు చేర్చుకురన్న తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలని.. గెలిచి చూపించాలని షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు సవాలు విసిరారు.

కోమటి రెడ్డి అయితే.. ఇప్పుడు ఎన్నికలొస్తే కేసీఆర్ గజ్వేల్ లో గెలవడం కూడా సాధ్యం కాదన్నాడు. ఫిరాయింపు దారుల చేత రాజీనామా చేయించి వారిని కారు గుర్తుపై గెలిపించుకుంటే తను 2019 ఎన్నికల్లో పోటీనే చేయను అని కోమటిరెడ్డి సవాలు విసిరాడు. 

ఇలాంటి సవాళ్లపై ఇప్పటి వరకూ తెరాస స్పందించన లేదు! ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించలేకపోవడం అనేది తెరాస వీక్ నెస్. అంత సత్యసంధతతో కూడిన రాజకీయాలు చేసేంత సీను గులాబీ పార్టీకి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో సీఎం పలికిన బీరాలు తెరాసకే బూమరంగ్ మారుతున్నాయి. ప్రతిపక్షాలు బలహీన పడ్డాయని ఆయన చెబుతుంటే.. ముందు నీ బలం ఏమిటో చూపించు, నైతికంగా వ్యవహరించు.. అంటూ అవే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి. కేసీఆర్ మాటలు.. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకే అవకాశంగా మారాయి. అందుకే ఇప్పుడు తెరాస కిక్కురుమనడం లేదు. 

Show comments