ఎక్కడున్నాం మనం..సెంవెన్టీస్ లోనా? సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అది కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే, హీరో కాళ్లు చూపించడం ఏమిటి? అదేమిటి అని ప్రశ్నిస్తే, బ్యాక్ చూపిస్తూ, మళ్లీ అవే కాళ్లు, అదే లుంగీ చూపించడం ఏమిటి? అంటే ఏం అనుకుంటారో? అనుకోండి..ఏం రాసుకుంటారో? రాసుకోండి..మా అభిమానులకు నచ్చితే చాలు అన్న ధీమానే కదా?
ఇదంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు గురించే. ఆ సినిమా జనాలకు కొత్తదేమీ కాదు. పక్కా తమిళ రీమేక్. వీరమ్ పేరుతో అజిత్ నటించిన సినిమాకు తెలుగు కలర్ జిరాక్స్. పైగా ఈ సినిమా తెలుగువారికీ కొత్త కాదు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ సినిమాను ఎప్పుడో తెలుగులోకి డబ్ చేసారు. వీరుడొక్కడే పేరుతో ఈ సినిమా ఇటీవలే టీవీలో ఫ్రసారమైంది కూడా.
పైగా ఈ సినిమాలో పవన్ ఎలా వుంటారో ఎవరికీ తెలియంది కాదు. ఇప్పటికే పవన్ ఫొటోలు ఇప్పటికే రకరకాలుగా బయటకు వచ్చాయి. అంటే ఈ సినిమా మీద అంత ఉత్కంఠ నెలకొనాల్సినంత సీన్ అయితే ఏమీ లేదు. మరి న్యూ ఇయర్ శుభ సందర్భంగా హీరో కాళ్లు చూపిస్తూ, ఫస్ట్ పోస్టర్ ఇవ్వడం ఏమిటి? దీన్ని ఫ్యూడలిస్ట్ మనస్తత్వం అనుకోవాలా? లేదా మరేమనుకోవాలి? వీళ్లా చేగువేరా గురించి, సోషలిజం గురించి, కమ్యూనిజం గురించి మాట్లాడేది?
తనను వెర్రిగా అభిమానించే జనాలు వున్నారు. వాళ్లు తన కాళ్లు చూసినా, కాలి వేళ్ల గోళ్లు చూసినా సంబరపడిపోతారు అనే ధీమాతో ఇలా వదిలారు అనుకోవాలా?
శుభమా అని న్యూ ఇయర్ పూటా తమ హీరో కాళ్లు చూసి సంబరపడాలా? అవేమైనా పుణ్యపాదాలా? ఏమనుకుంటున్నారు హీరోలు తమ అభిమానుల గురించి, సినిమా ప్రేక్షకుల ఆసక్తి గురించి. ఏమనుకున్నా, అది మాత్రం ఈ కాళ్లు చూపిన పోస్టర్ కన్నా కాస్తన్నా పైకి మాత్రం వుండదని రెండో పోస్టర్ మరింతగా దిగి వదిలినప్పుడే అర్థమైపోయింది.