చిరంజీవి.. ‘త్వరలో..’ అంతే!

మీలో ఎవరు కోటీశ్వరుడు.. మెగాస్టార్ చిరంజీవి హోస్టుగా.. అని ప్రకటించి ఇప్పటికే చాలా చాలా కాలం అయిపోయింది. అందుకు సంబంధించిన పోస్టర్లు విడుదల అయ్యాయి, టీజర్లు విడుదల అయ్యాయి, ట్రైలర్లు కూడా వచ్చాయి. ప్రతిది విడుదల అయినప్పుడు కూడా ఆ కార్యక్రమం టీవీలో ప్రసారం అయ్యేది ‘త్వరలో’ అని ప్రకటిస్తూ వచ్చారు.

మరి ఇంతకీ ఆ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందంటే మాత్రం.. చెప్పాం కదా “త్వరలో..’’ అని అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికీ ‘త్వరలో..’ అనే ట్యాగ్ తోనే కొనసాగుతోంది ఈ కార్యక్రమం. చిరంజీవి హోస్టుగా ఎలా ఉంటాడు? ఇది వరకూ అమితాబ్.. ఆ తర్వాత తెలుగునాట నాగార్జున.. పండించిన ఈ పాత్రలో మెగాస్టార్ ఎలా ఉంటాడనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించే అంశమే. అయితే.. నెలలు గడుస్తూ పోయిన కొద్దీ.. ఆ ఆసక్తి కాస్తా, అనాసక్తిగా మారిపోతున్నా.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మాత్రం మొదలయ్యేలా లేదు!

సెప్టెంబర్ నెలాఖరులో ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 12 న ఈ కార్యక్రమం ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం కానున్నదని అన్నారు. అయితే అది జరగలేదు.. ఇక కొత్త నెల, కొత్త సంవత్సరం కూడా వచ్చేసినట్టే. కానీ.. చిరంజీవి క్విజ్ కమ్ కోటీశ్వరులను చేసే షో మాత్రం.. ‘త్వరలో’ అని మిగిలిపోయింది. మరి దీనికి ప్రసార మోక్షం ఎప్పుడో!

Show comments