విశాఖ జిల్లాలోని భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బలను అక్రమార్కులు కొల్లగొట్టడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మన దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఇలాంటి వారసత్వ సంపద ఉందని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దోపిడీ కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ జనసేన ముఖ్య నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పర్యాటకశాఖ మంత్రి అయిన తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడ్డంపై పదేపదే మాట్లాడే పవన్‌కల్యాణ్ వెంటనే స్పందిస్తారని అంతా అనుకున్నారు. అదేంటో గానీ, ఇంత వరకూ ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించిన టీడీపీ, వెంటనే యాక్షన్‌లోకి దిగింది. విశాఖలో ఎర్రమట్టి దిబ్బల తరలింపుపై సీఎంవో సీరియస్ అయ్యినట్టు పెద్ద ఎత్తున తన మీడియాతో ప్రచారానికి తెరలేపింది.
పవన్ మాత్రం సైలెంట్. దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు కాసింత నిరుత్సాహానికి గురయ్యారు. పవన్‌కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తారని అనుకుంటే, ఆ అవకాశాన్ని టీడీపీకి ఇచ్చారనే ఆవేదన జనసేన నాయకుల్లో కనిపిస్తోంది.
ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బల్ని దోపిడీ చేస్తున్నదే టీడీపీ నాయకులని, తమ నాయకుడు వెలుగులోకి తెచ్చి ప్రశంసలు అందుకున్నాడని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. కానీ దీన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడంలో పవన్‌కల్యాణ్ ఉదాసీనంగా ఎందుకు వ్యవహరించారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.