పవన్‌లో అదే బ్యాలెన్స్ కలకాలం ఉంటుందా?

చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు గడచిపోయాయి. ఇప్పుడంతా నామినేటెడ్ పోస్టుల సీజను నడుస్తోంది. చంద్రబాబు నాయుడు తన అలవాటుకు భిన్నంగా వీలైనంత వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేయాలని కూటమిలోని మూడు పార్టీల నాయకులు కూడా కోరుకుంటున్నారు. అయితే మూడు పార్టీల్లోని నాయకులు చాలా మందికి పదవుల మీద ఆశ ఉండడం వల్ల.. నామినేటెడ్ పందేరం అనేది.. కూటమి ఐక్యతలో ముసలం పుట్టిస్తుందా? అనే భయాలు కూడా పలువురిలో ఏర్పడుతున్నాయి.

ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ చాలా బ్యాలెన్స్ తో వ్యవహరించారు. నిజానికి ఆయన 60 సీట్లు తీసుకోవాలని పార్టీ వర్గాలు వాదించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రకమైన ప్రచారం చేశారు. తీరా పవన్ 30 స్థానాలకు ఒప్పుకుని.. ఆ తర్వాత 21కి పరిమితం అయినప్పుడు పలువర్గాల నుంచి ఆయనను రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ చాలా సంయమనం పాటించారు. బ్యాలెన్స్ తో ఉన్నారు. ఎవరి మాటలకూ రెచ్చిపోలేదు.

ఎవరెన్ని అన్నప్పటికీ.. 21 స్థానాలు తీసుకోవడం గురించి గానీ.. తీసుకున్న స్థానాల్లో తెలుగుదేశం వారికే టికెట్లు ఇవ్వడం గురించి గానీ.. ఆయన తన నిర్ణయాలు మార్చుకోలేదు. స్థిరంగా ఉన్నారు. ఆ బ్యాలెన్స్ వల్లనే జనసేన నూటికి నూరుశాతం విజయాలను నమోదు చేసింది.

ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరం సీజను వచ్చేసరికి పవన్ లో అదే బ్యాలెన్స్ ఇంకా కొనసాగడం సాధ్యమేనా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఒక్క టీటీడీ చైర్మన్ పదవి కోసం తనను ఇప్పటికే 50 మంది అడిగారని పవన్ చెప్పారు. ఎవరో ఒక్కరికే కదా ఇవ్వగలం అని కూడా ఆయన అన్నారు. పవన్ మాటలను బట్టి.. టీటీడీ ఛైర్మన్ పదవి.. తన పార్టీకి కేటాయించాలని ఆయన కోరుకుంటున్నట్టుగా అర్థమవుతోంది.

Readmore!

నిజానికి టీటీడీ ఛైర్మన్ అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద నామినేటెడ్ పోస్టు. దీని కోసం చాలా పెద్ద వాళ్లు మాత్రమే ఆశపడతారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు మీద కూడా యాభై మంది ఒత్తిడి చేయడం జరగదు. అలాంటిది పవన్ కల్యాణ్ ను 50 మంది ఆల్రెడీ సంప్రదించారంటే.. జనసేన నాయకుల్లో ఎందరు ఎన్నెన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారోర అంచనా వేయచ్చు.

ఈ నేపథ్యంలో పవన్ ఎన్నికల తరహా బ్యాలెన్స్ తోనే ఉండగలరా? లేదా, తమకు ఇన్ని పోస్టులు కావాలని పట్టుపడతారా? అలా పంతాలకు పోవడం కూటమి ఐక్యతకు విఘాతం కాదా? అనే అభిప్రాయాలు పలువురిలో కలుగుతున్నాయి.

Show comments

Related Stories :