కూటమి అధికారంలోకి రావడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. జగన్ సర్కార్‌పై వ్యతిరేకతను సృష్టించడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో వుంది. తాను అధికారంలోకి వస్తే వారంలోపు పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తానని జగన్ చెప్పడం, అయితే హామీని నిలబెట్టుకోలేకపోవడం, అలాగే వారి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం తదితర కారణాలు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారి తీశాయి.
మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్‌ను తొలగించి పాత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు సంపూర్ణంగా పని చేస్తానని పవన్‌కల్యాణ్ చెప్పిన మాటల్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నమ్మారు. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు సర్కార్ జీపీఎస్‌ను కొనసాగిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో ఉపాధ్యాయులు భగ్గుమన్నారు.
చంద్రబాబు సర్కార్ చేతిలో తాము మోసపోయామంటూ గ్రారెంటీడ్ పెన్షన్ పథకం (జీపీఎస్) గెజిట్ ప్రతుల్ని కాల్చి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగడం గమనార్హం. జగన్ సర్కార్‌తో అంటకాగిన ఐఏఎస్ అధికారి రావత్ జారీ చేసిన జీవో అంటూ టీడీపీ అనుకూల మీడియా ...చంద్రబాబు సర్కార్‌ది తప్పు కాదన్నట్టు కథనాలు వండివార్చింది. ఈ కథనాలపై ఆర్థికశాఖ చావు కబురు చల్లగా చెప్పింది.
ఈ జీవో జారీలో ఎలాంటి కుట్రలేదని ఆర్థికశాఖ అధికారులు తేల్చి చెప్పారు. రొటీన్‌గా జరిగిపోయిందని వారు స్పష్టం చేశారు. అంటే జగన్ సర్కార్‌తో అంటకాగిన అధికారులు ఉద్దేశపూర్వకంగా జారీ చేసిన జీవో కాదని, అన్నీ తెలిసే చంద్రబాబు సర్కార్ గెజిట్ విడుదల చేసినట్టు తేల్చి చెప్పడం విశేషం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ చేసినట్టుగా తాను మోసం చేయనని పవన్‌కల్యాణ్ భారీ డైలాగ్‌లు చెప్పారు.
మరి ఇప్పుడు పవన్‌కల్యాణ్ ఏమంటారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా నెలరోజులకే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ దుస్థితి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.