పదవి కోసం అల్లాడిపోతున్న మోస్ట్ సీనియర్ లీడర్

పదవి లేకుండా నాయకులు ఉండలేరనే విషయం అందరికీ తెలిసిందే. జీవితాంతం పదవిలోనే ఉండాలని కోరుకుంటారు. తనకు వారసులు ఉంటే తన తరువాత వారికి పదవి రావాలని అనుకుంటారు. పదవుల కోసమే పార్టీలు మారతారు. ఒక్క మాటలో చెప్పాలంటే పదవీ దాహం తీరనిది. సంతృప్తి అనేది ఉండదు. ఎంత అనుభవించినా మొహం మెత్తనిది ఏమైనా ఉందంటే అది పదవి మాత్రమే.

రాజకీయాలలో ఊహించినవి జరగవు. ఊహించనివి జరుగుతుంటాయి. పదవులు కూడా అంతే. కొందరికి అనుకోకుండా పదవులు వస్తాయి. కొందరికి ఎంత ప్రయత్నించినా రావు. కొందరు నాయకులు తాము రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పార్టీలోనే విధేయతతో ఉంటారు. కానీ పదవి రాదు. కొందరు పార్టీలు మారి పదవులు సంపాదించుకుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కొంత అదృష్టం కూడా ఉండొచ్చు. ఫలానా కారణం అని చెప్పడం కష్టం.

సరే.. అసలు విషయాని కొస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక పెద్దాయన, మోస్ట్ సీనియర్ లీడర్ పదవి కోసం అల్లాడిపోతున్నాడు. తనకు పదవి ఇవ్వాలని ఆక్రోశిస్తున్నాడు. వేడుకుంటున్నాడు. ఆయనే వీహెచ్ గా పాపులరైన వి. హనుమంత రావు. ఈయన 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీకి పరమ విధేయుడు. రాముడికి హనుమంతుడు ఎలాగో వాళ్లకు ఈయన అలాగ అన్న మాట. సార్ధక నామధేయుడు.

ఎమ్మెల్సీగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఒకసారి మంత్రిగా కొద్దికాలం పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తనకు సీఎం పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని చెప్పుకుంటారు. సీఎం కాలేదనే కొరత తప్ప అన్ని పదవులు వరించాయి. ఇప్పుడు ఆయన వయసు 76 ఏళ్ళు. కానీ పదవి కావాలి. Readmore!

ఈమధ్య గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు అలియాస్ కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కదా. దానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కాబట్టి ఆ సీటు తనకు ఇవ్వాలని హనుమంత రావు అడుగుతున్నారు. తనకు ఎనిమిదేళ్లుగా ఒక్క పదవి కూడా లేదని, కాబట్టి ఈ అవకాశం తనకు ఇవ్వాలంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినని అన్నారు. ఖమ్మం టిక్కెట్ కావాలని చాలా అడిగారు. అయినా ఫలితం కనబడలేదు. ఇప్పుడు రాజ్యసభ ఇవ్వాలంటున్నారు. కానీ వీహెచ్ కోరిక నెరవేరకపోవొచ్చు. కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీని నిలబెట్టాలని డిసైడ్ చేసిందట. దాన్ని ఎవరూ కాదనలేరు కదా.

Show comments

Related Stories :