పిఠాపురం వర్మకు రంగు పడిందా?

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అచ్చంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిష్టవేసి.. అక్కడి ప్రజలతో మాట్లాడుతూ, ఒకచేత్తో వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ, మరో చేత్తో అక్కడ తన విజయంలో కీలక భూమిక పోషించిన తెలుగుదేశం నాయకుడు వర్మ వెనుక గోతులు తవ్వేశారా?

అయిదేళ్లుగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ పనిచేసిన పిఠాపురం వర్మకు.. ఏ పదవిని ఆశగా చూపి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఆయనను పవన్ కు అనుకూలంగా పని చేయించారో..  ఆ పదవి విషయంలోనే ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం వచ్చినప్పుడు మొదటి సీటును పిఠాపురం వర్మ కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పట్లో హామీ ఇచ్చారు. ఇండిపెండెంటుగా పోటీ చేసి పిఠాపురం స్థానాన్ని గెలిచి తెలుగుదేశానికి మళ్లీ కానుకగా ఇవ్వాలని అనుకున్న వర్మ దూకుడుకు చంద్రబాబు నాయుడు కళ్లెం వేశారు. వర్మకు ఇచ్చిన ఆ హామీ విషయంలో చంద్రబాబు కంటే శ్రద్ధగా దాన్ని నెరవేర్చడానికి పనిచేయవలసింది పవన్ కళ్యాణ్.

ఎందుకంటే ఆయన కోసమే పిఠాపురం వర్మ త్యాగం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తన ఆశ్రిత పక్షపాతానికి పెద్దపీట వేశారు. తన పార్టీ సేవలో ఉన్న పిడుగు హరిప్రసాద్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారు. మరొకవైపు సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ పార్టీ పతనాన్ని అంచనా వేసి ఆ పార్టీ నుంచి తెలుగుదేశం లోకి ఫిరాయించిన సి.రామచంద్రయ్యకు కూడా మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం దొరికింది. Readmore!

ఫిరాయింపుదారులకు తొలి విడతలోనే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తోంది. సి.రామచంద్రయ్య కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో పవన్ ద్వారా మంత్రాంగం నడిపేడా అనే అనుమానాలు పుడుతున్నాయి.

ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ ఉన్న రెండు ఎమ్మెల్సీలను ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా తప్పు చేశారని అభిప్రాయం తెలుగుదేశం వారిలో వ్యక్తం అవుతోంది. పిఠాపురంలో తనకు సహాయం చేసిన వర్మకు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీల ఎంపిక కోటమి సంగతి ఏమోగానీ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలను రగిలిస్తోంది.

Show comments