అప్పుడు చెప్పను బ్రదర్ అన్నాడు.. ఇప్పుడు చెప్పాడు

అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య వృత్తిపరమైన వైరం గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నిండు సభలో పవన్ గురించి మాట్లాడ్డానికి నిరాకరిస్తూ.. 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. అప్పట్నుంచి ఈ క్షణం వరకు బన్నీ-పవన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి మరింత ఆజ్యం పోసేలా అల్లు అర్జున్ కూడా ఎప్పటికప్పుడు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విశేషం.

ఆ వివాదం తర్వాత బన్నీ-పవన్ చాలా తక్కువ సందర్భాల్లో కలుసుకున్నారు. చంద్రబాబు తన అనుచరులతో పవన్ కల్యాణ్ అమ్మగారిని తిట్టించినప్పుడు, తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ఆ టైమ్ లో పవన్ కు సంఘీభావంగా బన్నీ నిలబడ్డాడు. ఇక అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లలో కలుస్తూనే ఉన్నారు.

మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కు బహిరంగంగా తన మద్దతు తెలిపాడు అల్లు అర్జున్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బన్నీ వేసిన ట్వీట్ పవన్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందనే సంగతి పక్కనపెడితే.. బన్నీ-పవన్ మధ్య మినిమం గ్యాప్స్ లో నడుస్తున్న ఫ్యాన్ వార్ ను మాత్రం ఈ ట్వీట్ తప్పనిసరిగా తగ్గిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఎన్నికల ప్రయాణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటా పవన్ కు శుభాకాంక్షలు అందించాడు అల్లు అర్జున్. "మీ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తూ, ఎంచుకున్న మార్గాన్ని చూసి నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను. ఓ కుటుంబ సభ్యుడిగా నా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది." అంటూ పోస్ట్ పెట్టాడు.

Readmore!

పవన్-అల్లు అర్జున్ కు లింక్ పెడుతూ ఎన్ని గొడవలు జరిగినా, వివాదాలు చెలరేగినా అల్లు అర్జున్ ఎప్పుడూ స్పందించలేదు. అటు పవన్ కూడా పట్టించుకున్నట్టు కనిపించలేదు. సరిగ్గా ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ, పవన్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ వేశాడు బన్నీ. ఇన్నేళ్లలో ఎన్నో గొడవలు జరిగితే పట్టించుకోని బన్నీ, పోలింగ్ సమీపిస్తున్న వేళ, ఫ్యాన్స్ మధ్య చీలక ఉండకూడదని, గంపగుత్తగా మెగా ఫ్యాన్స్ ఓట్లన్నీ పవన్ కు పడాలనే ఉద్దేశంతో ఈ ట్వీట్ వేసినట్టుంది. 

Show comments

Related Stories :