చిరు దృష్టిలో సీఎం, పవన్ ఇద్దరూ ఒక్కటేనా?

ఇంతేనా? ఈ వీడియో విడుదలతో మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నికల సీజనుకు తన విడత ప్రచారాన్ని ముగించేసినట్టేనా? కేవలం రెండు వీడియోలతో ఆయన తన ప్రస్తుత రాజకీయ ఆసక్తికి ఫుల్ స్టాప్ పెట్టేశారా? కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రమాజీ మంత్రి కావడం మాత్రమే కాదు, ఇప్పటికి కూడా టెక్నికల్ గా కాంగ్రెసు పార్టీలోనే ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి.. రెండు వీడియో సందేశాల రూపంలో మాత్రమే ప్రచారం నిర్వహించారు.

అయితే ఇప్పుడు ప్రజల దృష్టిలో మెదలుతున్న సందేహం ఒక్కటే! మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో బిజెపి అభ్యర్థి ఎంపీ సీఎం రమేశ్, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు.. మరోవైపు తన తమ్ముడు పవన్ కల్యాణ్ సమానమేనా? అనేది సందేహం! వారికి అలాంటి సందేహం కలగడానికి కూడా సరైన కారణం ఉంది.

కొన్ని రోజుల కిందట సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ బాబు హైదరాబాదులోని మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. వారిద్దరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ తనకు ఆత్మీయులని, మంచివాళ్లని పొగుడుతూ.. వారిని గెలిపించాలని వారి వారి నియోజకవర్గాల ఓటర్లకు విజ్ఞప్తిచేస్తూ ఒక వీడియో కూడా మెగాస్టార్ విడుదల చేశారు.

అంతకుముందు ఒకసారి పవన్ కల్యాణ్ తన సెట్స్ కు వచ్చి కలిసినప్పుడు.. అయిదు కోట్లరూపాయలు ఆయన పార్టీకి విరాళం ఇచ్చి, పవన్ ను ప్రోత్సహించారు. ఆయా సందర్భాల్లో ఏపీ కాంగ్రెస్ నేతల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆయన ఇంకా తమ పార్టీ సభ్యుడే అని వారు అన్నారు గానీ.. చిరంజీవి పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు పవన్ కల్యాణ్ ను గెలిపించడానికి పిఠాపురం వాసులను ఉద్దేశించి మరో వీడియో కూడా విడుదల చేశారు.

Readmore!

ఇది పవన్ అభిమానులకు ఇబ్బందికరంగా ఉంది. సీఎం రమేశ్ కు వీడియోనే, పవన్ కల్యాణ్ కు కూడా వీడియోనేనా? అని వారు బాధపడుతున్నారు. పవన్ కల్యాణ్ కోసం మెగాస్టార్ స్వయంగా ప్రచారానికి వచ్చి ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు. ఆయనకు ఇద్దరూ ఒకటేనా అని కూడా అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పకపోవచ్చు గాక.. కానీ ఆయన మౌనం కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవాలి.

తాను రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్దదలచుకోలేదని చిరు అనవచ్చు. కానీ.. వెంకటేష్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టలేదు. ఆయన ఖమ్మంలో వియ్యంకుడు కాంగ్రెస్ అభ్యర్థికి, కైకలూరులో మిత్రుడు బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కు ప్రచారం చేస్తున్నారు. మరి చిరంజీవి మాత్రం.. తమ్ముడి కోసం ప్రచారానికి వెళితే రాజకీయముద్ర పడుతుందని ఎందుకు భయపడుతున్నట్లు? అనేసందేహం పలువురిలో ఉంది.

Show comments

Related Stories :