ఎమ్బీయస్‍: ఇరకాటంలో పాక్ సైన్యం

పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వానికి ఎంత దూరంలో ఉండాలో తెలియక యిబ్బంది పడుతోంది. ఒకప్పుడైతే సైనిక నియంతలే పాలించారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం, క్రమబద్ధంగా ఎన్నికలు అంటూ తంతు జరుపుతున్నా, ఆ ఎన్నికలు సైన్యం కనుసన్నల్లో జరుగుతున్నాయనేదీ, వారు ఆమోదించిన వారే ప్రభుత్వాధినేతలు అవుతున్నారనేదీ బహిరంగ రహస్యం. కానీ ఎన్నికైన తర్వాత పాలకులు తమ చిత్తం వచ్చినట్లు పాలిస్తూ తమకే కాక సైన్యానికీ చెడ్డ పేరు తెస్తున్నారు. పాక్‌లో ప్రతీ పార్టీ వ్యవస్థ (సైన్యానికి మరో పేరు) ను నిందిస్తుంది.  సైన్యానికి అధికారం కావాలి తప్ప చెడ్డ పేరు అక్కరలేదు. తమకెందుకు వచ్చింది అని తప్పుకుందామంటే యిది ఒక పులి స్వారీలా అయిపోయింది. ఇన్నాళ్లూ తెర వెనుక అధికారం చలాయిస్తూ వచ్చి యిప్పుడు హఠాత్తుగా వదిలేస్తే యీ రాజకీయ నాయకులు తమను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారేమోనన్న భయం.

2018 ఎన్నికలలో ఇమ్రాన్ పార్టీ ఐన పిటిఐ (పాకిస్తాన్ తెహరీక్ ఎ ఇన్‌సాన్)కు అండగా నిలబడి అతను ప్రధాని కావడానికి సైన్యం సహకరించింది. కానీ ఇమ్రాన్ అస్తవ్యస్త పాలనలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అంతా ఇమ్రాన్ వలననే అంటే, అతను సైన్యం వలననే అనసాగాడు. సైన్యం, దానికి అధిపతిగా ఉన్న బాజ్వా తనను గద్దె దింపాలని చూస్తున్నాయని అన్నాడు. సైన్యానికి ఒళ్లు మండింది.  దానికి తోడు అతను ఉక్రెయిన్ యుద్ధం ముంగిట్లో ఉండగా రష్యాకు వెళ్లాడు. అమెరికాకు మండింది. అది పాక్ సైన్యాన్ని గిల్లింది. పాక్ సైన్యం ప్రతిపక్షాలను దువ్వింది. ఇమ్రాన్ తిరిగి రాగానే 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టించింది. 342 ఓట్లలో 174 ఓట్లు తీర్మానానికి అనుకూలంగా పడి ఇమ్రాన్ గద్దె దిగాల్సి వచ్చింది. ఇదంతా అమెరికా కుట్ర అన్నాడు ఇమ్రాన్. అతని అనుచరులు రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు.

ఇటు సైన్యం గతంలో తమకు విరోధిగా ఉన్న పిఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్) నాయకుడు నవాజ్ షరీఫ్‌తో రాజీ పడింది. ఇమ్రాన్‌ను కట్టడి చేయాలంటే అతనే తగినవాడు అనుకుని, అతనికి పునరావాసం కలిగించారు. కోర్టులు కేసులు కొట్టేశాయి. క్షమాభిక్ష పెట్టేశాయి.  అతని తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా పిఎంఎల్-ఎన్, పిపిపి (పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ) కలిసి పాకిస్తాన్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పిడిఎమ్) పేర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2023 ఆగస్టు దాకా ఏలాయి. ఆర్థిక పరిస్థితి ఇమ్రాన్ హయాం కంటె దిగజారింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 40% ఉంది. కూరలు, పళ్లు, పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) లెక్కల ప్రకారం పాకిస్తాన్ విదేశీ ఋణం 2022-23లో 123.57 బిలియన్ డాలర్లుంటే 2023-24లో 130.85కి పెరిగింది. ఆ ప్రభుత్వమే యిప్పుడు కొనసాగుతోంది. ఇప్పుడు మళ్లీ ఋణం అడిగితే ఐఎంఎఫ్ చాలా షరతులు పెడుతుంది. ఎయిర్‌లైన్స్, స్టీల్ మిల్స్ వగైరా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరం చేయమంటుంది. దానివలన కార్మికులు తిరగబడవచ్చు.

షెహబాజ్ పాలన ఆగస్టులో ముగిశాక, రూలు ప్రకారం మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ సైన్యం వాయిదాలు వేసి చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించింది. ఇమ్రాన్‌ని గద్దె దింపినపుడు సైన్యం తమకేమీ సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రెస్ ముందుకు వచ్చి మేము ఎన్నికల నిర్వహణలో కలగచేసుకోము అని చెప్పింది. కానీ తమకు యిష్టం లేని ఇమ్రాన్‌కు ఎన్ని యిబ్బందులు కలగచేయాలో అన్నీ చేసింది. దానికి కోర్టులను ఉపయోగించుకుంది. కోర్టులు అతనికి మూడు కేసుల్లో 10, 14, 7 ఏళ్ల జైలు శిక్షలు వేశాయి. 2023 మే నుంచి జైల్లోనే ఉన్నాడతను. మొదటి రెండు కేసులు అతనికి వచ్చిన బహుమతులను ప్రభుత్వ ట్రెజరీకి (తోషా ఖానా) యివ్వకుండా యింటికి పట్టుకుపోయాడు అని, సైఫర్ కేసులో ప్రభుత్వ రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించాడని. ఎన్నికలకు వారం ముందు వేసిన మూడో కేసు పూర్తిగా వ్యక్తిగతమైంది. ప్రస్తుత భార్య బుష్రాను చేసుకున్నపుడు ఆమె ‘ఇద్దత్’ (పూర్వ వివాహం రద్దు చేసుకున్నాక అగవలసిన కాలం) సమయం పూర్తి కాకుండానే పెళ్లి చేసుకున్నందుకు గాను ఏడేళ్ల శిక్ష వేశారు. సైన్యం మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం అతని పార్టీ నాయకుల్ని బెదిరించి అతనికి వ్యతిరేకంగా మారేట్లు చేసింది. అతను జైల్లో ఉండగానే ఎన్నికలు జరిగాయి. Readmore!

ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ పార్టీ పిటిఐను రద్దు చేసి, దాని గుర్తయిన ‘బ్యాట్’ను ఫ్రీజ్ చేసింది. దాంతో ఆ పార్టీ వారందరూ స్వతంత్రులుగానే పోటీ చేయాల్సి వచ్చింది. తమ పార్టీని అదుపు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా హింసాత్మకమైన ఆందోళనలు చేసిన వాళ్లందరినీ జైల్లో పెట్టింది ప్రభుత్వం. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పరచడానికి చేతులు కలిపిన ప్రతిపక్షాలు, ఎన్నికలలో మాత్రం కలిసి పోటీ చేయడానికి యిష్టపడలేదు. మూడు ప్రధాన పక్షాల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. ఇమ్రాన్ పార్టీ వారికే ఎక్కువ సీట్లు వచ్చాయి. తమకు యింకా ఎక్కువ రావాల్సి ఉందని, 80 సీట్లలో అక్రమాలు జరిగాయని ఇమ్రాన్ అన్నాడు. ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న అన్వరుల్ హక్ కాకర్ అంతా సవ్యంగానే జరిగింది పొమ్మన్నాడు.

ప్రజలలో అతని కున్న పలుకుబడి యింకా తగ్గలేదని గ్రహించిన పిఎంఎల్ ఎన్, పిపిపి మళ్లీ దగ్గరై మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. పిఎంఎల్ ఎన్ నాయకుడు నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ ప్రధాని అయ్యాడు. పిపిపి అధ్యక్షుడు జర్దారీ దేశాధ్యక్షుడయ్యాడు. వీరికి కొన్ని చిన్నాచితకా పార్టీలు వచ్చి చేరాయి. ఇప్పుడీ ప్రభుత్వం బాగా నడవాలని, ఇమ్రాన్‌కు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోవాలని సైన్యం మొక్కుకుంటోంది. అదీ దాని బాధ. ఇమ్రాన్ పార్లమెంటు ఎన్నికలలోనే కాదు, అసెంబ్లీ ఎన్నికలలో కూడా తనొక విస్మరించరాని శక్తినని చూపుకున్నాడు. నాలుగు ప్రాంతాలలో ఒకటైన ఖైబర్ – ఫక్తూన్‌ఖ్వాలో అతని పార్టీ ప్రభుత్వం ఏర్పరచింది. 115 సీట్లలో 84 వాళ్లవే.

297 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో అక్కడి ప్రధాన పార్టీ ఐన పిఎంఎల్-ఎన్‌కు 137 స్థానాలు వస్తే పిటిఐకు 116 వచ్చాయి. 8 సీట్ల ఎంక్యూఎం, యితరులను కలుపుకుని నవాజ్ షరీఫ్ కూతురు మరియం ముఖ్యమంత్రిగా (ఈమెను ప్రధానిగా చేయడమే నవాజ్ ఆశయమట) అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. మరో పార్టీ ఐన పిపిపి కి సింధు ప్రాంతంలోనే పట్టు ఎక్కువ. అక్కడ 130 సీట్లుంటే దానికి 84 సీట్లు వచ్చి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ కూడా పిటిఐకు 11 సీట్లు వచ్చాయి. 51 సీట్ల బలోచిస్తాన్‌లో పిపిపికి 11సీట్లు మాత్రమే వచ్చినా 11 సీట్లు తెచ్చుకున్న జెయుఐ-ఎఫ్ (జమాయిత్ ఎ ఉలేమా ఎ ఇస్లామ్ - ఫజ్లూర్)ను, యితరులను కలుపుకుని ఎలాగోలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ దేశంలోని నాలుగు ప్రాంతాలలోనూ ఉనికి చాటుకున్నది పిటిఐయే!

ఇక పార్లమెంటు (వాళ్లు నేషనల్ ఎసెంబ్లీ అంటారు) ఎన్నికల వరకు వస్తే మొత్తం సీట్లు 336. వాటిలో ఎన్నికలు జరిగే జనరల్ సీట్లు 266 (పంజాబ్‌లో 141, సింధ్‌లో 61, ఖైబర్ ఫక్తూన్‌ఖ్వాలో 45, బలోచిస్తాన్‌లో 16). అదనంగా ఉన్న 70లో 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్ చేస్తారు. ఎన్నికైన పార్టీలు తాము గెలిచిన సీట్ల సంఖ్య నిష్పత్తిలో యీ రిజర్వ్ సీట్లకు సభ్యులను నామినేట్ చేస్తారు. ఈ 266 సీట్లలో రెండు ఖాళీగా ఉన్నాయి. తక్కిన వాటిలో పిటిఐ మద్దతుతో గెలిచిన స్వతంత్రుల సంఖ్య 93 (35%). రిజర్వ్ సీట్ల కోటా కింద యీ పార్టీకి అదనపు సీట్లు రావాలి కానీ పిటిఐని పార్టీ కింద గుర్తించ లేదు కాబట్టి వారికి అదనపు సీట్లు రాలేదు. ఆ విధంగా కూడా దానికి నష్టం కలిగింది.

షరీఫ్ నాయకత్వంలోని పిఎంఎల్-ఎన్‌కు 75 (28%), జర్దారీ నాయకత్వం లోని పిపిపికి 54 (20%) వచ్చాయి. (ఇండియా టుడే 260224, ఫ్రంట్‌లైన్ 050424 ప్రకారం). రిజర్వ్ సీట్లలో కోటా కలవడంతో పిఎంఎల్-ఎన్‌కు 116, పిపిపికి 73 వచ్చాయి. షరీఫ్, జర్దారీ చేతులు కలిపినా సరిపోదు. అందుకని తక్కినవారిని కూడా అధికార కూటమిలోకి లాక్కుని వచ్చారు. 17 సీట్లు వచ్చిన సింధు ప్రాంతపు ఎంక్యూఎం (ముత్తహిదా క్వామీ మూవ్‌మెంట్) షరీఫ్‌తో చేతులు కలిపింది. వీరు కాక నిజమైన స్వతంత్రులు (19), జెయుఐ-ఎఫ్ (6) ఉన్నారు. షరీఫ్ సోదరుల్లో సైన్యానికి యిష్టుడు  తమ్ముడు షెహబాజే కాబట్టి అతనే ప్రధాని అయ్యాడు.

ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల రూపురేఖల గురించి క్లుప్తంగా చెప్తాను. పిఎంఎల్-ఎన్‌కి చైర్మన్ 74 ఏళ్ల నవాజ్ షరీఫ్. అతను మూడోసారి ప్రధానిగా ఉండగా పనామా పేపర్స్‌లో అతని పేరు ఉండడంతో సుప్రీం కోర్టు 2017లో అతన్ని పదవి నుంచి తొలగించింది. 2018లో పదేళ్ల జైలు శిక్ష వేసి అతను ఏ పదవీ నిర్వహించ కూడదంది. 2019 నుంచి అతను వైద్య చికిత్స పేరున లండన్‌లో ఉన్నాడు. ఇమ్రాన్‌ను దింపేశాక, సైన్యం అతన్ని 2023 అక్టోబరులో పాక్‌కు రానిచ్చింది. నవంబరు కల్లా అతనిపై అన్ని కేసులూ ఎత్తేశారు. అతని తమ్ముడు షెహబాజ్ (72 సం.లు) ప్రస్తుత ప్రధాని. కూతురు మరియం (50 సం.లు) నవాజ్ వారసురాలిగా అతనితో త్వరలో పోటీ పడవచ్చు అనుకుంటున్నారు. పార్లమెంటులో 53% సీట్లు కల పంజాబ్‌ వారి కంచుకోట. కానీ యీసారి దానికి బీటలు వారాయి. ధరల పెరుగుదలపై కోపాన్ని అధికారంలో ఉన్న ఆ పార్టీపై చూపించారని అంటున్నారు. ఎన్నికలు వస్తూండగా ఇమ్రాన్‌పై పెట్టిన మూడో కేసుతో (భార్య ఇద్దత్ పీరియడ్) అతనిపై జాలి కలిగిందని కొందరు అంటున్నారు.

పిపిపి గురించి చెప్పాలంటే ప్రధానంగా దానికి బలం ఉన్నది 23% పార్లమెంటు సీట్లున్న సింధు ప్రాంతంలో. ఈ ఎన్నికలలో కరాచీలో తప్ప తక్కిన సింధులో స్థానాలు బాగా గెలిచింది. పార్టీ చైర్మన్ దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో-జర్దారీ (35 సం.లు). కో-చైర్మన్ ఆమె భర్త జర్దారీ (70 సం.లు). పార్టీ స్థాపకుడు జుల్ఫికర్ భుట్టోను సైన్యం పదవి నుంచి దింపి, జైల్లో పెట్టి, ఉరి తీసే ముందుకు కొద్దిగా ముందు 1977లో లండన్‌లో ఉంటున్న అతని 24 ఏళ్ల కూతురు బేనజీర్ పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది. భుట్టో మరణానంతరం బేనజీర్, ఆమె తల్లి పార్టీ పగ్గాలు చేపట్టి ప్రజాస్వామ్యం కోసం పోరాడసాగారు. బేనజీర్ పెద్ద తమ్ముడు మూర్తుజా తమ్ముడు షానవాజ్‌తో సహా 1980లలో ‘అల్ జుల్ఫికర్’ పేర అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థను నడుపుతూ తండ్రిని చంపిన జనరల్ జియాకు వ్యతిరేకంగా లిబ్యా, సిరియాల నుంచి పోరాటం చేస్తూండేవాడు. పాక్‌లో తండ్రి ప్రత్యర్థులను కూడా చంపాడు. అతని తమ్ముడు షానవాజ్ ఫ్రాన్సులో చంపబడ్డాడు.

బేనజీర్ మాత్రం పాక్‌లోనే ఉంటూ సైనిక నియంత జియా ఉల్ హక్ చేత మాటిమాటికీ ఖైదు చేయబడుతూ పోరాటం సాగించింది. 1984 నుంచి రెండేళ్ల పాటు లండన్‌లో ప్రవాసంలో ఉండి 1986లో తిరిగి వచ్చింది. అప్పుడు ఆమెకు అసిఫ్ ఆలీ జర్దారీ తారసిల్లాడు. సింధ్‌లో ధనిక కుటుంబానికి చెందిన జర్దారీ పోలో ఆటగాడు. బేనజీర్ తన కంటె రెండేళ్లు చిన్న అయిన అతనితో ప్రేమలో పడి 1987లో పెళ్లాడింది. పెళ్లాడిన మరుసటి సంవత్సరమే సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఎన్నికలు జరిగి ఆమె ప్రధాని అయింది. మార్గరెట్ థాచర్ విధానాలను అవలంబిస్తూ దేశాన్ని పెట్టుబడిదారీ విధానం వైపు మళ్లించింది. దాంతో పాటు మహిళలకు హక్కులు కల్పించింది. ఇది ఇస్లామిస్ట్ శక్తులకు నచ్చలేదు.

దీనికి తోడు ఆమె భర్త జర్దారీ ప్రభుత్వ కాంట్రాక్టులపై 10% కమిషన్ తీసుకునేవాడనే పేరు రావడంతో మిస్టర్ టెన్ పర్శెంట్‌గా ముద్ర కొట్టారు. ఇది సాకుగా చూపించి దేశాధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ 1990లో చేశాడు. అవినీతి కేసుల్లో జర్దారీకి శిక్ష వేసి జైల్లో పెట్టారు. ఎన్నికలు నిర్వహించారన్న మాటే కానీ రిగ్గింగు జరిపించి నవాజ్ షరీఫ్‌ను ప్రధానిని చేసి కూర్చోబెట్టారు. కానీ అతన్నీ అవినీతి ఆరోపణలపై మూడేళ్లలోనే పదవి నుంచి తొలగించారు. 1993లో బేనజీర్ మళ్లీ ప్రధాని అయింది. ఆమె భర్త జర్దారీ మంత్రి అయ్యాడు. మళ్లీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ దశలో ఆమె తమ్ముడు మూర్తూజా తిరిగి వచ్చాడు. తండ్రి పెట్టిన పార్టీ తన అక్క, బావ చేతుల్లోకి వెళ్లిపోవడంతో మండిపడ్డాడు. అతను టెర్రరిస్టు అనే కారణం చేత బేనజీర్ అరెస్టు చేయించింది. బెయిలుపై బయటకు వచ్చి, సింధ్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి అక్క, బావలపై ధ్వజమెత్తాడు. 1996 సెప్టెంబరులో అతన్ని పోలీసులు ఒక ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఆ కారణం చూపించి నెల తర్వాత దేశాధ్యక్షుడు లెఘానీ బేనజీర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశాడు. మూర్తూజా హత్య, అవినీతి ఆరోపణలపై జర్దారీని జైలుకి పంపించాడు. 1997 ఎన్నికలలో పిపిపి ఓడిపోయింది. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికయ్యాడు. జర్దారీ మళ్లీ జైలుకి వెళ్లి 2004 వరకు జైల్లో ఉన్నాడు.

బేనజీర్ 1998లో దుబాయి, లండన్‌లలో ప్రవాసంలో ఉంటూ పదేళ్లు గడిపింది. అవినీతి ఆరోపణలపై 2003లో స్విస్ కోర్టులో శిక్ష పడింది. అమెరికా మధ్యవర్తిత్వం నెరపి, అప్పటి పాక్ సైనిక నియంత పెర్వేజ్ ముషారఫ్‌తో రాజీ కుదర్చడంతో 2007లో పాక్ తిరిగి వచ్చి 2008 నాటి ఎన్నికలలో పాల్గొనదామనుకుంది. 2007 డిసెంబరులో రావల్పిండిలో ఒక ర్యాలీలో మాట్లాడిన తర్వాత హత్య కావింపబడింది. అల్‌ఖైదా వాళ్లు మేమే చేశామన్నారు. కానీ ముషారఫ్ చేయించాడని కొందరి అనుమానం.  భార్య చనిపోగానే జర్దారీ పార్టీ సమావేశం ఏర్పరచి, 19 ఏళ్ల కొడుకు బిలావల్‌ను తల్లి రాజకీయ వీలునామా (అలాటిది ఉంటుందని ఎవరూ వినలేదు) చదవమన్నాడు. ‘నేను లేని పక్షంలో నా భర్త పార్టీకి నాయకత్వం వహించాలి’ అని బేనజీర్ రాసిందని ప్రకటించారు.

ఇక అప్పణ్నుంచి పార్టీ జర్దారీ చేతికి వచ్చేసింది. కొడుకు చైర్మన్, తను కో-చైర్మన్ అన్నాడు. బేనజీర్ పట్ల సింపతీతో కాబోలు 2008లో పార్టీ నెగ్గి, పిఎంఎల్-ఎన్, యితర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చేసింది. ముషారఫ్ చేత రిజైన్ చేయించి, 2008 సెప్టెంబరులో యితను దేశాధ్యక్షుడై పోయి ఐదేళ్ల పాటు పాలించేశాడు. తనపై కేసులన్నీ కొట్టించేసుకున్నాడు. ఆ తర్వాత కూడా పార్లమెంటుకి ఎన్నికవుతూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ దేశాధ్యక్షుడయ్యాడు. అతని కొడుకు బిలావల్ 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు నడిచిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో ఫారిన్ మినిస్టర్ అయ్యాడు. ఈ ప్రభుత్వంలో ఏ పోస్టు అడుగుతాడో తెలియదు.

వీళ్ల మాట ఎలా ఉన్నా ఇమ్రాన్ జైలు నుంచే వీళ్లని భయపెడుతున్నాడు. అందువలన అతని పార్టీ సభ్యులను తమ పార్టీల్లోకి ఫిరాయించుకోవాలని యివి ప్రయత్నిస్తున్నాయి. స్వతంత్రులుగా ఉంటే ఫిరాయింపు సులభం కాబట్టి ఇమ్రాన్ తన పార్టీ వాళ్లను ఏదో ఒక చిన్న పార్టీలో చేరిపోమని సలహా యిచ్చాడు. పాక్‌లో ఉన్న పార్టీల చరిత్ర క్లుప్తంగానైనా తెలిసింది కాబట్టి యిలాటి నాయకుల చేతిలో పాక్ ప్రజాస్వామ్యం ఎలా బతికి బట్టకడుతుందో, కడితేగిడితే సైన్యం ఎలా స్పందిస్తుందో ఎవరైనా ఊహించగలరా? (ఫోటో – మరియం, షెహబాజ్, జర్దారీ; క్రింది వరుస బిలావల్, ఇమ్రాన్, నవాజ్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :