వృధాగా పోతున్న సమ్మర్ బాక్సాఫీస్

ఏప్రిల్ సినిమాల కథ ముగిసింది. ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. ఇప్పుడు మే నెల బాక్సాఫీస్ మొదలు కాబోతోంది. చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేదు.

మే మొదటివారంలో ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్నవదనం, బాక్, జితేందర్ రెడ్డి, శబరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్నవదనం సినిమాలపైన మాత్రమే కూసింత అంచనాలున్నాయి.

రెండో వారంలో కృష్ణమ్మ వస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత సత్యదేవ్ నుంచి రాబోతున్న సినిమా ఇది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ వారంలో ప్రస్తుతానికి కృష్ణమ్మ ఒక్కటే షెడ్యూల్ అయింది. మరో 2-3 చిన్న సినిమాలొచ్చే అవకాశం ఉంది.

మూడో వారంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సత్యభామ, రాజు యాదవ్ లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలామందిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడ కూడా మరో 2 చిన్న సినిమాలొచ్చే ఛాన్స్ ఉంది.

నాలుగో వారంలో లవ్ మీ, హరోంహర, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలొస్తున్నాయి. వీటిలో లవ్ మి సినిమా ఉన్నంతలో ఎట్రాక్ట్ చేస్తోంది. ఎందుకంటే, ఇది దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోంది కాబట్టి.

ఇలా ఏ వారం చూసుకున్నా.. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్ తప్ప పెద్ద సినిమాలేం కనిపించడం లేదు. నిజానికి కల్కి సినిమా వచ్చినట్టయితే, మే నెల బాక్సాఫీస్ కళకళలాడేది. ఆ సినిమా వాయిదా పడ్డంతో నెల మొత్తం బోసిపోసినట్టు కనిపిస్తోంది.

అయితే లవ్ మి, ఆ ఒక్కటి అడక్కు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలకు ఇది ఊహించని వరం. ఏమాత్రం ఆకట్టుకున్నా, ఓ 10 రోజుల పాటు బాక్సాఫీస్ ను దున్నేయొచ్చు. లేదంటే, ఏప్రిల్ లానే మే నెల కూడా చప్పగా అలా గడిచిపోతుందంతే. 

Show comments

Related Stories :