వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ స‌రే ... వాళ్లు పాల్గొన‌డం ఏంటి?

వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మంపై అనుకున్న‌ట్టే న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. మొద‌టి నుంచి ఈ కార్య‌క్ర‌మం వివాదాస్ప‌దం అవుతూ వ‌చ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రోసారి జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి ఎందుకో అవ‌స‌ర‌మో ప్ర‌జానీకానికి వివ‌రించేందుకు వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ఇది. 

ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా వైసీపీకి సంబంధించింది. అయితే మాంసం తింటున్నామ‌ని ఎముక‌లు మెడ‌లో వేసుకున్న చందంగా ఈ కార్య‌క్ర‌మంలో అధికారుల‌ను వైసీపీ భాగ‌స్వాముల్ని చేయ‌డంతో వివాదం త‌లెత్తింది.

ఈ క్ర‌మంలో వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మంలో అధికారులు పాల్గొన‌డాన్ని స‌వాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ జ‌రిగింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాదులు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. పార్టీ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ అధికారులు పాల్గొన‌డంతో పాటు, ప్ర‌భుత్వ సొమ్మును వెచ్చించ‌డంపై న్యాయ‌వాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు పాల్గొనేలా ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచ‌న‌లు చేశార‌ని వాద‌న‌లు వినిపించారు. ప్ర‌తివాదులుగా పేర్కొన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  సీఎస్‌, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులు, గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంట‌ర్స్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌తివాదుల‌ను హైకోర్టు ఆదేశించింది. అనంత‌రం నాలుగు వారాల‌కు కేసు విచార‌ణ‌ను వాయిదా వేసింది.  Readmore!

Show comments