వైసీపీ ప్ర‌భుత్వంపై ఇలాంటివే చేయాల్సిందే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీలో ఒక్కొక్క‌రిది ఒక్కో దారి. ఏపీ బీజేపీలో టీడీపీ, వైసీపీ అనుకూల‌, వ్య‌తిరేక నాయ‌కులు ఎక్కువ‌య్యారు. బీజేపీని బ‌లోపేతం చేయాలనే త‌పన ఉన్న నేత‌లు త‌క్కువ‌య్యారు. దీంతో ఆ పార్టీని ముఖ్యంగా టీడీపీ అనుకూల నేత‌లు బాగా వాడుకుంటున్నారు. వీరికి ఎల్లో మీడియా అండ‌దండ‌లు ఉండ‌డంతో ఆడిందే ఆట పాడిందే పాట‌గా త‌యారైంది.

అయితే ఇంత కాలానికి ఏపీ బీజేపీ నేత‌లు ఒక ప‌నికొచ్చే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాగునీటి కాలువ‌ల‌పై బీజేపీ నేత‌లు స్పందించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ‌ది. వైఎస్సార్ జిల్లాలోని వీఎన్ ప‌ల్లె మండ‌లంలోని స‌ర్వ‌రాయ‌సాగ‌ర్ ప్రాజెక్ట్‌ను బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్‌, ఆ పార్టీ నేత‌లు బుధ‌వారం సంద‌ర్శించారు. ఈ ప్రాజెక్టు వైఎస్సార్ హ‌యాంలో క‌ట్టారు.

వైఎస్సార్ మ‌రణానంత‌రం పొలాల‌కు నీళ్లు అందించే కాలువ‌ల నిర్మాణాన్ని పాల‌కులు విస్మ‌రించారు. చంద్ర‌బాబు హ‌యాంలో ప‌ట్టించుకోక‌పోయినా, క‌నీసం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాతైనా పొలాల‌ను కృష్ణా నీళ్ల‌తో త‌డుపుతార‌ని రైతులంతా న‌మ్మ‌కంగా వున్నారు. అయితే జ‌గ‌న్ పాల‌న‌లో కూడా చిన్న కాలువ‌లను నిర్మించిన పాపాన పోలేదు.

ఈ నేప‌థ్యంలో స‌ర్వ‌రాయ‌సాగ‌ర్ ప్రాజెక్ట్‌ను స‌త్య‌కుమార్ త‌దిత‌ర బీజేపీ నేత‌లు సంద‌ర్శించి వైసీపీ ప్ర‌భుత్వ ఉదాసీన‌త‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌త్య‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతుల‌ను సీఎం జ‌గ‌న్ గాలికి వ‌దిలేశార‌ని విమ‌ర్శించారు. స‌ర్వ‌రాయ‌సాగ‌ర్ ప్రాజెక్టులో నీటిని జ‌గ‌న్ త‌న సిమెంట్ ఫ్యాక్ట‌రీకి, ఆయ‌న మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి త‌న చేప‌ల చెరువుల‌కు వాడుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.  

గండికోట, సర్వరాయసాగర్ ప్రాజెక్టుల పరిధిలో పంటకాలువల గురించి జగన్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ని త‌ప్పు ప‌ట్టారు. 45 ఏళ్లుగా వైఎస్ కుటుంబాన్ని కడప జిల్లా ప్రజలు మోస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ముఖ్యమంత్రులను చేశారన్నారు. అయిన‌ప్ప‌టికీ  సొంతజిల్లా ప్రజలకు, రైతులకు సీఎం ద్రోహం చేయడం దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు. క‌నీసం ఇప్ప‌టికైనా చిన్న కాలువ‌ల నిర్మాణానికి ప్ర‌భుత్వం ముందుకు రావాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Show comments