చంద్రబాబునాయుడు ప్రస్తుతానికి ఇంకా రాజకీయంగా యాక్టివేట్ కాలేదు. నిజానికి 28వ తేదీ తరవాత.. ఆయన రాజకీయ సభలు, కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా బెయిలు నిబంధనలు అనుమతిస్తాయి. అయినా సరే.. ఆయన ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు.
అయినా ఆయనకు ఆ లోటు తెలియనివ్వకుండా ఆయన తరఫున చాలా మంది.. రంగంలోకి దిగి.. ఆయన విజయం కోసం పాటుపడుతున్నారు. ఆయనకోసం దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే కాదు, వదినమ్మ పురందేశ్వరి కూడా శక్తివంచన లేకుండా పాటుపడుతుండడం విశేషం.
భాజపా సారథి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగకుంటే రాష్ట్ర ప్రజలకు కష్టాలే అని ప్రకటించేశారు. పీఎఫ్ చెల్లింపులు ఆగిపోయాయట, ఆరోగ్య శ్రీ నిధులు అందడం లేదట, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదట... ఇలా తనకు తోచిన విమర్శలను ఆమె చేసేశారు. ఆ కారణాలన్నిటినీ నివేదించి.. అందుచేత వైకాపా గద్దె దిగి తీరవలసిందే అని తన అంతిమనిర్ణయాన్ని తేల్చిచెప్పేశారు.
సరే ఓకే.. చిన్నమ్మ చెప్పిందే నిజం మరియు కరెక్టు అనుకుందాం. వైకాపా గద్దె దిగితే తప్ప రాష్ట్రం బాగుపడదనేది నిజమే అనుకుందాం! మరి గద్దె మీద ఎవరు ఉండాలనేది కూడా ఆమె సెలవిచ్చి ఉంటే బాగుండేది. వైకాపా ఉంటే ప్రజలకు కష్టాలే అని ఆమెకు తెలుసు.. మరి వారికి సుఖాలు దక్కాలంటే ఎవరి పాలన కావాలో కూడా తెలియాలి కద.
ఆమె దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీకి రాష్ట్రసారథిగా ఉంటున్నారు. కనీసం తమలో ఆత్మవిశ్వాసం ఉన్నదనడానికి, తమ పార్టీ పట్ల ప్రజలకు అభిమానం ఉన్నదని బిల్డప్ ఇచ్చుకోవడానికైనా.. భాజపా అధికారం వస్తే రాష్ట్రం బాగుపడుతుందనే మాట చెప్పాలి కదా.. ఆ మాట మాత్రం చెప్పడం లేదు.
ఇండైరక్టుగా పురందేశ్వరి తన మరిది చంద్రబాబునాయుడు పాలన కావాలని ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ బిజెపి పాలన రావాలి.. అని ఆమె చెప్పినా కూడా ప్రజలు కామెడీ అనుకుంటారు తప్ప.. సీరియస్ గా తీసుకోరు. పురందేశ్వరి మాటల్లో మరో కామెడీ కూడా ఉంది. విభజన చట్టంలోని హామీలకు భాజపా కట్టుబడి ఉందని ఆమె అంటున్నారు. అంటే ఇంకా ఆ హామీలు పూర్తికాలేదనే ఒప్పుకుంటున్నారు.
ఇలాంటి టెక్నికల్ మాటల ద్వారా.. ప్రత్యేకహోదాకు తమకు సంబంధం లేదని పలాయనం చిత్తగిస్తున్నారు. చట్టంలో ఉన్న అంశాలవరకు గమనించినా సరే.. పదేళ్లు గడిచిపోతుండగా.. ఇంకా ‘కట్టుబడి ఉంటాం’ అంటున్నారంటే అది సిగ్గుపడాల్సిన విషయమే కదా అనేది జనం సదేహం. మరి పురందేశ్వరి ఈ కట్టుబడి ఉంటామనే కట్టుకథలని కట్టిపెట్టి, ఎప్పటికి ఆ హామీలన్నీ పూర్తిచేస్తారో?