కాంగ్రెస్ చేజారుతున్న సెటిలర్లు?

ఎన్నికల లాస్ట్ మినిట్ టైమ్ వచ్చేసింది. దాంతో నిన్నటికి నిన్న కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ లో వున్న తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గం తన సోషల్ మీడియా ప్రచారం ముమ్మరం చేసింది. ఎలాగైనా సెటిలర్స్ ఓట్లు, అవి కాకుంటే వాటిలోని తెలుగుదేశం అనుకూల ఓటును కాంగ్రెస్ వైపు మొగ్గేలా చేయాలనే తాపత్రయం క్లారిటీగా కనిపించింది. దీని వెనుక పలు కారణాలు వున్నాయి.

తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైన వెంటనే సెటిలర్లు అంతా బీఆర్ఎస్ మీద కోపంగా వున్నారనే ప్రచారం మొదలు పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే జగన్ కు అనుకూలంగా వుంటుందనే ఆలోచన ఒకటి. రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం తానులో ముక్కనే కదా అనే ఆలోచన ఇంకొకటి. రేవంత్ వస్తే భవిష్యత్ లో ఆంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా సాయం పట్టే అవకాశం వుంటుందనే ఆలోచన మరొకటి. ఇవన్నీ కలిసి ఆ దిశగా ప్రచారం ప్రారంభించేలా చేసాయి. సోషల్ మీడియాలోని ప్రో తెలుగుదేశం జనాలు అంతా కలిసి కాంగ్రెస్ కు అనుకూలంగా పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టాయి.

నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రబాబుకు వ్యతిరేకంగా వుంటే వుండొచ్చు కానీ, కమ్మ సామాజిక వర్గం మీద మాత్రం కాదు అన్నది వాస్తవం. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా, హైటెక్ సిటీ లాంటి కీలక ప్రదేశానికి సమీపంలో కమ్మవారి సంఘానికి స్ధలం ఇచ్చారు. సిటీలో చాలా కాంట్రాక్టులు సెటిలర్స్, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కమ్మవారికే దక్కాయి. కొన్నాళ్ల క్రితం చాలా భూముల సెటిల్ మెంట్ లు కమ్మవారికి అనుకూలంగా జరిగినట్లు గుసగుసలు వుండనే వున్నాయి. అదీ కాక సెటిలర్లు అంతా ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నవారే. వాటి విలువలు కాంగ్రెస్ వస్తే ఎలా వుంటాయో అన్న భయం వుండనే వుంది.

ఇంత చేసినా కూడా కేవలం జగన్ మీద ద్వేషంతోనో, చంద్రబాబు మీద ప్రేమతోనో బీఆర్ఎస్ ను ఓడించాలనే తాపత్రయం సెటిలర్స్ లోని పో తెలుగుదేశం జనాలకు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా కనిపించింది. అయితే ప్రచారం ముగిసే సమయానికి ఎందువల్లనో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. సెటిలర్స్ లోని ప్రో తెలుగుదేశం అయినా, నాన్ కమ్మ వర్గం మెల్లగా మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గడం మొదలైంది.  Readmore!

కాంగ్రెస్ వస్తే ఎలా వుంటుందో, ఇప్పుడు బాగానే వుంది కదా అనే ఆలోచన మొదలైంది. సెటిలర్స్ లోని రెడ్డి సామాజిక వర్గం కూడా ప్రో చంద్రబాబు వర్గం హడావుడి చూసి, కులాభిమానాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ వైపు మొగ్గడం మొదలైంది. అంతకు ముందు ఈ ఓటు బ్యాంక్ రేవంత్ వైపు పోలరైజ్ అయినట్లు కనిపించింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు అనుకూల వర్గం హడావుడి పెరిగిందో ఈ వర్గం ఆలోచనలో పడింది.

దాంతో ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి సెటిలర్ల మూడ్ మారుతున్నట్లు కనిపించింది. దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ లు గాభరా పడడం మొదలైంది. చంద్రబాబును ఇలా అన్నారు, అలా అన్నారు, చంద్రబాబు అరెస్ట్ కు ముందు కేటీఆర్ పార్టీ ఇచ్చారు ఇలాంటి గ్యాసిప్ లు పుట్టించడం మొదలు పెట్టారు. పోలింగ్ కు ముందు ఈ తరహా ప్రచారం నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రచారంలో ఆక్రోశం కనిపిస్తుంది. చేతులు జారుతున్న గాభరా కనిపిస్తుంది. పైగా ఆంధ్ర నుంచి కమ్మ నాయకులు నేరుగా రంగంలోకి దిగి పార్టీలతో సంబంధం లేకుండా తమ వారి కోసం ప్రచారం చేయడం చూసాక మరింత క్లారిటీ వచ్చేసింది.

మొత్తం మీద ఎన్నికల వాతావరణం ప్రారంభమైనపుడు సెటిలర్ల ఓట్ల మీద వున్న ఊహాగానాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. 

Show comments