స్కిల్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్ట్‌తో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర అర్ధంతరంగా ఆగిపోయింది. ఈ నెల 9న లోకేశ్ యువగళం పాదయాత్ర మూగబోయింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే, లోకేశ్ మాత్రం ఢిల్లీలో గడుపుతున్నారు. అరెస్ట్‌కు భయపడి లోకేశ్ ఢిల్లీలో తలదాచుకుంటున్నారని ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్ ఖరారు పేరుతో లోకేశ్ భూదోపిడీకి పాల్పడ్డారని, ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆయనపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు నమోదు చేసింది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఈ నెల 29 నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది.
ఈ పాదయాత్ర జైలుయాత్రగా మారుతుందా? లేక న్యాయస్థానంలో ఉపశమనం పొంది జనాల్లో ఉంటారా? అనే చర్చకు తెరలేచింది. లోకేశ్ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని సమగ్రమైన ఆధారాలున్నాయని సిట్ చెబుతోంది. దీంతో ఆయనకు న్యాయ స్థానంలో ముందస్తు బెయిల్ దక్కుతుందా? లేదా? అనే అనుమానాలు టీడీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుండడం, మరోవైపు లోకేశ్ అరెస్ట్ అవుతారనే ప్రచారం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తండ్రీతనయులిద్దరూ అరెస్ట్ అయితే టీడీపీని ఎవరు? ఎలా ముందుకు నడిపిస్తారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి అనేక చర్చల మధ్య లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టనుండడం ఉత్కంఠ రేపుతోంది. నంద్యాలలో పర్యటనలో వుండగానే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు, పాదయాత్రలో లోకేశ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.