టాలీవుడ్ లో ఉగాది అప్ డేట్స్ హడావుడి

పండగలకు సినిమాలు రిలీజ్ చేయడం కష్టం కావొచ్చు కానీ తమ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేయడం, ఓ కొత్త అప్ డేట్ ఇవ్వడం ఏమంత కష్టమైన పనికాదు. ఎప్పట్లానే ఈ ఏడాది ఉగాదికి కూడా చాలా అప్ డేట్స్ వచ్చాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం..

బాలకృష్ణ ఫస్ట్ లుక్

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ మూవీ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఎప్పట్లానే ఈ లుక్ కూడా సీరియస్ గా, ఎగ్రెసివ్ గా ఉంది. చేతిపై టాటూతో, పెద్ద మీసాలు, గడ్డంతో బాలయ్య లుక్ చూడ్డానికి కాస్త కొత్తగా ఉంది. 'ఈసారి అందరి అంచనాలను మించి' అనే క్యాప్షన్ కూడా తగిలించి సినిమాపై అంచనాలు పెంచాడు రావిపూడి.

డెవిల్ అప్ డేట్

చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న కల్యాణ్ రామ్ సినిమా డెవిల్. ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఉగాది సందర్భంగా మరో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈసారి కూడా యాక్షన్ లుక్ నే విడుదల చేసి, సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. నవీన్ మేడారం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకుడు.

అల్లరి నరేష్ కామెడీ 

వరుసపెట్టి సీరియస్ సినిమాలు తీసిన అల్లరి నరేష్, ఇప్పుడు మళ్లీ తన పాత పంథాలోకి మారాడు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో, సున్నితమైన హాస్యంతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈరోజు సినిమా లాంఛ్ అయింది. మల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్.

నాగశౌర్య రంగబలి

ఉగాది సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించాడు నాగశౌర్య. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ హీరో, ఆ మూవీకి రంగబలి అనే డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సీహెచ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సాంగ్

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. పి.మహేష్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో, అందరి దృష్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై పడింది. రథన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

సైంధవ్

ఉగాది సందర్భంగా సైంధవ్ నుంచి కూడా కీలకమైన ప్రకటన వచ్చేసింది. వెంకటేష్ హీరోగా రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపట్నుంచి ప్రారంభం అవుతుంది. విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ఇది. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నవజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషించనున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.

నితిన్ - వెంకీ కుడుముల - రష్మిక

భీష్మ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఉగాది సందర్భంగా నితిన్-వెంకీ కుడుముల ప్రాజెక్టును అధికారికంగా ఎనౌన్స్ చేశారు. హీరోయిన్ గా రష్మికనే రిపీట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. ఎనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇంకా మరికొన్ని...

ఈ సినిమాల అప్ డేట్స్ తో పాటు.. రుద్రుడు సినిమా నుంచి సాంగ్ అప్ డేట్ వచ్చింది. ఇక సామజవరగమన రిలీజ్ డేట్ అప్ డేట్ కూడా వచ్చేసింది. రాయ్ లక్ష్మి జనతా బార్ విశేషాలతో పాటు.. దసరా, ఏజెంట్, కస్టడీ, ఊరి పేరు భైరవకోన, మీటర్ సినిమాల నుంచి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్లు కూడా వచ్చాయి. 

Show comments