సర్కారు వాళ్ల వెంటపడడం మోస్ట్ ఇంపార్టెంట్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ కారణాల దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన ఓటమి గురించి వారు ఎలాగైనా వ్యాఖ్యానించవచ్చు గాక.. కానీ, ఈ ఓటములను చూసి కొంచెం జాగ్రత్త పడడం తప్పనిసరి. అందుకు అధికార పార్టీ నాయకుల మదిలో రకరకాల వ్యూహాలు నడుస్తుండవచ్చు. కానీ.. ‘ఏ వర్గం ఓట్లయితే మాకు అవసరం లేదని’ ఈ ఓటమి సందర్భంగా వ్యాఖ్యానించారో ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కూడా వారికిక తప్పనిసరి.

పట్టభద్రుల ఓట్లు పడిన తీరులోనే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పుకూడా ఉంటుందని అనుకోవడం భ్రమ. అలాగని.. అతివిశ్వాసం కూడా పనికి రాదు. ఎంతగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు నూరుశాతం ఓట్లు గుమ్మరించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ.. అందుచేత అహంకరించి.. పట్టభద్రుల ఓట్లను కాలదన్నుకోవడం మంచి పని కాదు. వారిలో ఎందుకు అసంతృప్తి ప్రబలిందో గుర్తించి, దానిని చల్లార్చడం ప్రభుత్వం కర్తవ్యం. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా పరిస్థితులు సెట్ అవుతాయని.. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనకు 151 సీట్ల మెజారిటీ ఇచ్చారు. అన్నివర్గాలకు మేలు జరుగుతూనే ఉంది. కానీ.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన అనేది.. నిరుద్యోగ యువతరం ఆశించినంతగా జరగలేదు. అలాంటి భావన ప్రజల్లో, పట్టభద్ర యువతరంలో ఉన్నదని అనడానికి ఈ తీర్పు నిదర్శనం. పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన ఒక్కటే దీనికి మందు. 

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ పెట్టుబడులు కుదుర్చుకున్న వారి వెంటపడాలి. వారికి అనుమతుల పరంగా తక్షణం పనులు జరిగేలా పూనిక వహించాలి. పెద్ద పెట్టుబడిదారులను బతిమాలుతారో, వెంటపడి ఫాలో అప్ లు చేస్తారో.. మొత్తానికి కొన్ని యూనిట్లు వెంటనే రాష్ట్రంలో మొదలయ్యేలా చేయాలి. తద్వారా వేలసంఖ్యలో ఉద్యోగ అవకాశాలను ఈ ఏడాది చివరికెల్లా సృష్టించగలగాలి. 

అలా చేయగలిగితే.. పట్టభద్రులకు కొంత నమ్మకం కలిగించినట్టు ఉంటుంది. ఇన్నాళ్ల అలసత్వం ప్రభుత్వం తప్పు కాదని చెప్పుకోవచ్చు. కనీసం కొన్ని యూనిట్లు మొదలైతే.. తమ ప్రభుత్వం మళ్లీ ఏర్పడే సమయానికి ఇంకా అనేక వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందనే భరోసా ఇవ్వవచ్చు. ఇలాంటి పరిష్కారం ద్వారా మాత్రమే.. ప్రభుత్వం అన్ని వర్గాల్లోనూ తమ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది. ఆ దిశగా పారిశ్రామికవేత్తల వెంటపడి ఫలితాలు సాధించలేకపోతే.. ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Show comments